నేడు దేశమంతా దీపావళి పండుగ జరుపుకొంటోంది. బీజేపీ కూడా. దేశ ప్రజలు లక్ష్మీ బాంబులతో దీపావళి జరుపుకొంటుంటే, బీజేపీ మాత్రం ప్రత్యేకంగా తయారుచేసుకొన్న అద్వానీ, యశ్వంత్, జోషి, శాంత బాంబులతో దీపావళి చేసుకొంటోంది. మోడీని ప్రధాని అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించినప్పుడు తయారయిన బాంబులవి. వీటి గొప్పదనం ఏమిటంటే అవి అవసరమయినపుడల్లా ఎన్నిసార్లయినా మళ్ళీ మళ్ళీ పేలుతుంటాయి. బిహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్ లో బాంబులు పేల్చుకొని పండగ చేసుకొంటారని అమిత్ షా ఊహించారు కానీ స్వంత పార్టీలోనే సరిగ్గా దీపావళికి ముందు అసమ్మతి బాంబులు పేలుతాయని ఊహించలేకపోయారు. ఈ బాంబుల మోత భరించలేకనే ప్రధాని నరేంద్ర మోడి మళ్ళీ విదేశీ పర్యటనలకి బయలుదేరి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఆ అసమ్మతి బాంబులు ఏవిధంగా పేలాయంటే,
“బిహార్ ఎన్నికలలో విజయం సాధిస్తే ఆ క్రెడిట్ అంతా మొత్తం స్వంతం చేసుకొనేవాళ్ళు ఓడిపోగానే ఆ ఓటమిని పార్టీ సమిష్టి బాధ్యత అని అందరి నెత్తిమీద రుద్దడం చాలా తప్పు. ఈ ఎన్నికలలో ఓటమిని గమనిస్తే, డిల్లీ ఎన్నికల ఓటమి నుంచి బీజేపీ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని అర్ధమవుతోంది. ఈ ఓటమిపై లోతుగా సమీక్షించి కారణాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. అదేవిధంగా సమిష్టి నిర్ణయాలు తీసుకొనే పద్దతికి స్వస్తి పలికి పార్టీలో కొందరు మాత్రమే అన్ని నిర్ణయాలు ఎందుకు తీసుకొంటున్నారనే దానిపై సమీక్ష జరుగవలసి ఉంది. ఆ సమీక్షను బిహార్ ఎన్నికలలో పార్టీ పరాజయానికి కారణమయిన వారు కాక పార్టీలో మిగిలిన నేతలతో సమీక్ష జరుపవలసి ఉంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు,” ఇట్లు (మోడీ వచ్చిన తరువాత పక్కన పడేయబడ్డ) లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా మరియు శాంత కుమార్.