ఏపీ బీజేపీ సీనియర్లు బుంగమూతి పెట్టామని పార్టీ హైకమాండ్ కు సందేశం పంపారు. ఎన్నికల సన్నద్దత కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశానికి సోము వీర్రాజు, జీవీఎల్ నరిసంహారావు, విష్ణవర్ధన్ రెడ్డి వంటి వారు హాజరు కాలేదు. వీరంతా తమకు పోటీ చేసే చాన్స్ కోసం గట్టిగా ప్రయత్నించారు. కానీ సీట్ల సర్దుబాటులో వీరి పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. ఎంపీ అభ్యర్థులను ప్రకటించేయడంతో.. ఇక అసెంబ్లీ స్థానాల్లో అయినా తమకు ఓ సీటు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో తాము అసంతృప్తికి గురయ్యామన్న సంకేతాలను హైకమాండ్ కు పంపేందుకు కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. అయితే వీరు ముగ్గురు ఉద్దేశపూర్వకంగా సమావేశానికి డుమ్మా కొట్టలేదని బీజేపీ నేతలు కవర్ చేసుకున్నారు. సోము వీర్రాజుకు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు. అయితే సోము వీర్రాజుకు సీటు కేటాయింపు కోసం.. గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆనపర్తి సీటు సోము వీర్రాజుకు ఆఫర్ చేసినప్పటికీ ఆయన ఆసక్తి చూపలేదు. రాజమండ్రి రూరల్ లేదా సిటీల్లో ఒకటి కావాలని పట్టుబడుతున్నారని అంటున్నారు. కుదరదని చెప్పడంతోనే ఆయన డుమ్మా కొట్టారని చెబుతున్నారు.
సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీలో చాలా రచ్చ జరుగుతోంది. వైసీపీతో అంట కాగిన నేతలకు టిక్కెట్లు ఇస్తే.. టీడీపీ ఓటర్లు ఓటు వేసే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తూండటంతో హైకమాండ్ కూడా వీరికి టిక్కెట్లు ఇచ్చేందుకు . సర్దుబాటు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే వీరు మాత్రం.. పార్టీ ప్రయోజనాల సంగతి తర్వాత.. తమకు మాత్రం సీటు కావాలన్నట్లుగా పట్టుబడుతున్నారు.