గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా అష్టకష్టాలు పడుతోంది! గడచిన ఆరు నెలలుగా చూసుకుంటే… భాజపాపై గుజరాత్ లో కొంత వ్యతిరేకత నెమ్మదిగా పెరుగుతోందనే ఆందోళన ఆ పార్టీ వర్గాల్లోనూ ఎక్కువైంది. నిజానికి, గుజరాత్ భాజపాలో ఇప్పుడు బలమైన నాయకత్వం లేదనే చెప్పాలి. ఆనందీ బెన్ ముఖ్యమంత్రి అయిన తరువాత, మోడీ ఉన్నప్పటి మాదిరిగా పరిపాలన ప్రభావవంతంగా లేదు. గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో పటేళ్ల ఆందోళనలు పెరిగాయి. సంప్రదాయంగా వ్యవసాయం, చిన్నచిన్న వ్యాపారాలపై పటేళ్లు ఆధారపడి బతికేవారు. కానీ, ఇటీవలి కాలంలో వ్యవసాయం కలిసిరాకపోవడం, నోట్ల రద్దూ జీఎస్టీ వంటి నిర్ణయాలు చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపడంతో వారిలో నిరసన పెరిగింది. ఉద్యోగాలు కావాలీ, రిజర్వేషన్లు కల్పించాలంటూ పటేళ్లు రోడ్డెక్కిన పరిస్థితి చూస్తున్నాం. అలాగని, వారికి రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ కూడా గుజరాత్ లో భాజపా ఇప్పటికీ ఇవ్వలేకపోతోంది. పటేళ్లకు ఐదు శాతం రిజర్వేషన్లైనా ఇవ్వడం ఆచరణ సాధ్యమని కిషన్ రెడ్డి లాంటి భాజపా నేతలు అభిప్రాయపడ్డ సందర్భాలూ చూస్తున్నాం.
ఇంకోపక్క, గుజరాత్ అంటేనే అత్యధికంగా వ్యాపారాలపై ఆధారపడే కుటుంబాలు ఉండే రాష్ట్రం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సూరత్ వంటి ప్రాంతాల్లో చాలామంది వ్యాపారులు దెబ్బతిన్నారు. ఆ వ్యతిరేకత కూడా కొంత ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే, గుజరాత్ లో భాజపా ఇప్పుడు అష్టకష్టాలూ పడాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు నెలల కిందట భాజపా పరిస్థితి ఎంతో బలంగా కనిపించేది, కానీ ఇప్పుడా వాతావరణంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సర్వేలను పరిగణనలోకి తీసుకుంటే… గత నెలలో వచ్చిన సర్వేల్లో కాంగ్రెస్ కు 29 శాతం ఓట్లు వస్తాయని తేల్చారు. భాజపాకి 53 శాతం ఓట్లు పడే ఛాన్సు ఉన్నట్టు లెక్కలు కట్టారు. అయితే, తాజా పరిస్థితి ఏంటంటే.. రెండు పార్టీల మధ్యా హోరాహోరీ పోరు అంటున్నారు. ఎన్నికలు దగ్గపడుతున్న తరుణంలో ఈ పతనాన్ని భాజపా ఆపకపోతే కొంత ఇబ్బందిపడే పరిస్థితి కనిపిస్తోంది.
అందుకే, ప్రస్తుతం భాజపా గుజరాత్ లో ఉపయోగిస్తున్న మంత్రం… మోడీ! నిజానికి, ఈ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రధానంగా భాజపా ప్రచారం చేయడమే లేదు. కేవలం మోడీని మాత్రమే నమ్ముకున్నారు. ప్రచార బ్యానర్లు, కటౌట్లు ఎక్కడ చూసినా… గుజరాత్ ముఖ్యమంత్రిగా మళ్లీ మోడీ బరిలో ఉన్నారా అనే అనునమానం కలిగేట్టుగా ఏకపక్ష ప్రచారం చేస్తున్నారు. తాజా సర్వేల నేపథ్యంలో భాజపా ఓ బలమైన సెంటిమెంటును గుజరాతీయుల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ‘మన గుజరాతీయుడు దేశాన్ని ఏలుతున్నాడు, కాబట్టి సొంత గడ్డపై భాజపాని గెలిపించుకోవాలి’ అనే స్థానిక సెంటిమెంట్ ను ప్రధానంగా తెరమీదికి తెస్తున్నారు. మరి, ఈ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. ఏదేమైనా, భాజపా కాస్త కంగారు పడుతోందన్న వాతావరణమైతే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.