తెలంగాణ బీజేపీ ఇరవై మూడు అసెంబ్లీ సీట్లను మాత్రమే సీరియస్ గా తీసుకుంది. అక్కడ మాత్రమే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హంగ్ తీసుకు రావాలని .. తాము కింగ్ మేకర్లం లేదా కింగ్ కావాలని గట్టి పట్టుదలగా ఉంది. అందుకే గతంలో బలంగా ఉన్న… రెండో స్థానంలో నిలిచినా… గత పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన సీట్లపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. ఈ జాబితాలో మొత్తం 23 సీట్లు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఉత్తర తెలంగాణలో ముస్లింలు ఎక్కువగా ఉంటూండటం తో అక్కడ బీజేపీ బలపడే ప్రయత్నం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముథోల్ వంటి చోట్ల రెండో స్థానంలో నిలిచింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా పన్నెండు స్థానాల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది. ఈ స్థానాలన్నింటిలోనూ బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.
అలాగే గ్రేటర్ పరిధిలో కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. అక్కడ పలు నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి అంచనా వేసుకుని కొన్ని నియోజకవర్గాలపై గురి పెట్టింది. మహబూబ్ నగర్ జిల్లలాలో కల్వకుర్తి వంటి చోట్ల విజయానికి తగ్గరగా వచ్చి ఆగిపోతుంది. ఇలాంటి నియోజకవర్గాలన్నీ ఎంపిక చేసుకుని బలమైన అభ్యర్థులు ఉన్నారనుకున్న చోట్ల గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మిగతా చోట్ల ప్రయత్నాలు చేసి టైం వేస్టు చేసుకోవడం దండగని అనుకుంటోంది. అంటే బీజేపీ వ్యూహం పూర్తిగా హంగ్ లక్ష్యంతోనే సాగుతోందని అర్థమవుతోంది.