ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే కొన్ని వ్యాఖ్యలు ఎంత వ్యంగ్యంగా దెప్పిపొడుపుగా ఉంటాయో తెలిసిందే. మొన్ననే, ఆర్టీసీ ఉద్యోగులపై వరాలు కురిపించిన సమయంలో కేంద్రంపై ఇదే తరహాలో మాట్లాడారు కదా. ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందనీ, రావాల్సిన నిధులపై లెక్కతేల్చేస్తామనీ, అవసరమైతే కోర్టుకుపోతామన్నారు. ఇక్కడి ప్రతిపక్షాలు ఢిల్లీకి పోతామని అంటున్నారు, ఢిల్లీ ఎలయ్య చేతిలో ఏముంది అన్నారు. అక్కడి నుంచి ఎల్లయ్య వస్తాడా, మల్లయ్య వస్తాడా అంటూ కేంద్రంపై విమర్శలు చేసేశారు. ఈ వ్యాఖ్యలు చేసి రెండు రోజులు తిరక్కముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు కొంతమంది కేంద్రమంత్రుల్ని ఇవాళ్ల కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. దిశ ఘటన అంశంతోపాటు విభజన చట్టంలోని కొన్ని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై కేంద్రంతో చర్చిస్తారని తెరాస వర్గాలు అంటున్నాయి.
అయితే, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనను భాజపా ఈసారి కాస్త సీరియస్ గానే తీసుకుంటుందా, తాజాగా చేసిన విమర్శలను దృష్టిలో ఉంచుకునే సీఎంని భాజపా నేతలు ట్రీట్ చేసే అవకాశం ఉందా… అంటే అవుననే అనిపిస్తోంది. నిన్ననే, భాజపా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ… ఢిల్లీ నుంచి ఎల్లయ్య వస్తాడా మల్లయ్య వస్తాడా అని మాట్లాడావ్ కదా, ఇప్పుడు ఎవర్ని కలవడానికి ఢిల్లీ వస్తున్నావ్ అంటూ కేసీఆర్ ని ప్రశ్నించారు. ఢిల్లీకి వచ్చింది ఎల్లయ్యని కలవడానికా, మల్లయ్యని కలవడానికా చెప్పాలన్నారు. కేంద్ర పెద్దల గురించి మాట్లాడేప్పుడు సంస్కారవంతంగా, గౌరవం ఇచ్చే విధంగా మాట్లాడాలన్నారు. ఈ ఎల్లయ్య మల్లయ్య వ్యాఖ్యల గురించి ఇప్పటికే భాజపా నాయకత్వానికి టి.ఎంపీలు ఓ నివేదిక ఇచ్చినట్టు సమాచారం.
ఆర్టీసీలో కేంద్రం వాటా లెక్కలపై కూడా కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజానికి, సమ్మె సమయంలో తమ వాటా పేరుతో రాష్ట్రంలో జోక్యం చేసుకునేందుకు భాజపా సిద్ధమైంది. కార్మికుల వెంట ఉంటామంటూ రాజకీయంగా వాడుకునే ప్రయత్నమూ చేసింది. కానీ, చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా కేసీఆర్ యూటర్న్ తీసుకుని కార్మికులతో పాలాభిషేకాలు అందుకున్నారు. ఆర్టీసీ సమ్మెను రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి భాజపా సర్వం సిద్ధం చేసుకునేలోపు కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చేశారు. దీంతో ఈ సమ్మె అంశం భాజపాకి ఏరకంగానే ఉపయోగపడకుండా పోయినట్టయింది. ఓరకంగా ఈ అసంతృప్తీ భాజపా నేతల్లో ఇప్పుడుంది. ఆర్టీసీలో కేంద్రానికీ వాటా ఉంది కదా, రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలు ఏవైనాసరే కేంద్రానికి చెప్పాల్సిన ఉంటుందని గతంలో కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడీ పాయింట్ ని పట్టుకుని కేంద్రం స్పందించే అవకాశం ఉందేమో చూడాలి. ఏదేమైనా, ఢిల్లీలో ఇవాళ్టి కేసీఆర్ భేటీలపై కొంత ఆసక్తి నెలకొంది.