మహారాష్ట్రాలో ప్రస్తుతం పులులు, సింహాల మద్య యుద్ధం జరుగుతోంది. అంటే అడవుల్లో నివసించే పులులు, సింహాల మద్య కాదు..అవి బాగానే ఉన్నాయి కానీ ముంబైలో వాటి ప్రతీకలుగా చెప్పుకొంటున్న శివసేన, భాజపాల మధ్య యుద్ధం జరుగుతోంది. అంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మహారాష్ట్రాలో కూడా భాజపాకి మిత్రపక్షంతో యుద్ధాలు తప్పడం లేదని అర్ధం అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, మహరాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న భాజపా-శివసేన పార్టీల నేతల మాటలు ఈ యుద్ధానికి దారి తీశాయి. భాజపాకి చెందిన మంత్రి ప్రకాష్ మెహతా మీడియాతో మాట్లాడుతూ, ముంబై నగరంలో పులులు కంటే సింహాలే ఎక్కువున్నాయి,” అని శివసేనని ఉద్దేశ్యించి చిన్న వ్యాఖ్య చేశారు. శివసేన పార్టీ చిహ్నంలో పులి ఉంటుంది కనుక దానితో పోలిస్తే భాజపా సింహం వంటిదని చెప్పడం ఆయన ఉద్దేశ్యం. ఆయన వ్యాఖ్యలని శివసేన చాలా సీరియస్ గా తీసుకొంది. ఎంత అంటే మెహతా నియోజక వర్గమైన ఘాట్కోపర్ లో ఆయనని విమర్శిస్తూ ఫ్లెక్సీ బ్యానర్ పెట్టేంత..శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ లో కూడా ఆయనని హెచ్చరిస్తూ కధనం వ్రాసేటంత!
శివసేన పెట్టిన ఆ ఫ్లెక్సీ బ్యానర్ లో మంత్రి ప్రకాష్ మెహతాని ఉద్దేశ్యించి “పిల్లి తనను తాను సింహ అనుకొంటోంది. దాని సింహం ముసుగు తొలగించే సమయం వచ్చింది,” అని వ్రాసింది. శివసేన నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ “పిల్లికి దాని స్థానం ఏమిటో చూపించవలసి ఉంది” అని అన్నారు.
ఇక సామ్నా పత్రికలో ఆఫ్రికన్ అడవులలో ఒక తెల్లపులి సింహాన్ని చంపుతున్న చిత్రాన్ని ప్రచురించి దాని క్రింద “ఈ చిత్రంలో తన హద్దులు దాటిన సింహానికి ఏగతి పట్టిందో చూడవచ్చు. అది పులుల సామ్రాజ్యం. దానిలోకి సింహమైనా చొరబడటానికి వీలులేదు. ప్రవేశిస్తే అది సింహం అయినా కూడా దానికి పులి చేతిలో మరణం తప్పదు. అదే పులుల విధానం పరిపాలన,” అని వ్రాసింది. అది భాజపాని ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలేనని స్పష్టం అవుతోంది. మిత్రపక్షాలుగా కొనసాగుతున్నప్పుడు ఇంత తీవ్రంగా హెచ్చరికలు జారీ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. శివసేన మొదటి నుంచి కూడా భాజపా పట్ల ఈవిధంగానే చాలా దురుసుగా వ్యవహరిస్తునందున, మహారాష్ట్రాలో తన పట్టు పెంచుకోవాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మునిసిపల్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి భాజపా తన సత్తా చాటుకోవాలనుకొంటోంది. బహుశః అందుకే ఈ పులులు సింహాల యుద్ధం మొదలయిందేమో?