జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పొత్తుల విషయంలో చాలా క్లారిటీగా చెప్పారు. ఓట్లు చీలనివ్వబోమన్న తమ వ్యూహాన్ని నొక్కి చెప్పారు. అదే సమయంలో కలసి రావాలని బీజేపీని కోరడానికే ఢిల్లీ వెళ్లానని పవన్ కల్యాణ్ తొలి సారి నేరుగా చెప్పారు. పవన్ కల్యాణ్..బీజేపీతో అధికారిక పొత్తులో ఉన్నారు. kevr తాము టీడీపీతో వెళ్తామని బీజేపీని కూడా కలిసి రావాలని కోరుతున్నారు. బీజేపీ, జనసేన పొత్తు వల్ల ఓట్ల చీలిక పెరుగుతుంది తప్ప.. ఓట్లు కన్సాలిడేట్ అయ్యే అవకాశం లేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ కలిస్తేనే.. ప్రత్యామ్నాయ కూటమి సిద్ధమవుతుంది. అందుకే పవన్ టీడీపీతో కలిసి రావాలని బీజేపీని కోరుతున్నారు.
ఓ వైపు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి టీడీపీతో కలిసి పని చేయాలనే సంకేతాలు ఇవ్వడం.. మరో వైపు చంద్రబాబు కూడా రిపబ్లిక్ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ..మోదీకి పూర్తి మద్దతు ప్రకటించడంతో రెండు వైపులా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా క్లారిటీ వచ్చినట్లయింది. ఎన్డీఏలో చేరుతామా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. నిజానికి చంద్రబాబు ఎన్డీఏలో చేరుతారని గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. రెండు సార్లు ఢిల్లీలో చంద్రబాబు మోదీని కలిశారు. అమిత్ షాను నారా లోకేష్ ఓ సారి రహస్యంగా కలిశారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఆ తర్వాత డెవలప్మెంట్స్ ఏమీ లేవు. ఇప్పుడు పవన్ ప్రకటనతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.
టీడీపీతో మళ్లీ కలిసే అంశంలో బీజేపీ స్పందన ఎలా ఉండబోతోందనేది కీలకం. ఎందుకంటే ఏపీలో వైసీపీ నేతలు ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఢిల్లీలో ఎలాంటి మద్దతు కావాలన్నా ఇస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రం కోసం డిమాండ్ల పేరుతో వారిని ఇబ్బంది పెట్టడం లేదు. కొన్ని అప్పులు ఇస్తే చాలని సర్దుకుంటున్నారు. అందుకే కేంద్రం వైసీపీ విషయంలో సానుకూలంగా ఉందని చెబుతున్నారు. మరి ఇప్పుడు పవన్ కల్యాణ్.. కలిసి వస్తే రావాలి లేకపోతే వైసీపీ విముక్త ఏపీ కోసం టీడీపీతో వెళ్తామని తేల్చేయడంతో ఏం చేయబోతోందనేది ఆసక్తిగా మారింది. బీజేపీ కలిస్తే ఓట్ల పరంగా కూటమికి కలసివచ్చేది లేదు. ఓట్లేతర అంశాలపై మద్దతే బీజేపీ కూటమిలో కలుపుకోవడానికి కారణం అవుతుంది. లేకపోతే ఎవరూ దేకేవారు కాదు.