భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల్ని చీల్చడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం లేదా.. ప్రభుత్వాన్ని మరింతం బలోపేతం చేసుకోవడం చేయడం రివర్స్ అవుతోంది. అది ఆ పార్టీపై ప్రజల్లో చులకన భావం తెలుస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయాలు తెచ్చి పెడుతోంది. అయినా ఆ పార్టీ మారడం లేదు.
మహారాష్ట్రలో ఎన్సీపీని నిలువుగా చీల్చేసింది బీజేపి. అజిత్ పవార్ పై ఈడీకేసులు.. ఇతర ఒత్తిళ్లు ఉన్నాయి. ఆయన అత్యధిక మంది ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీ పంచన చేరిపోయారు. అయితే ఇదంతా శరద్ పవార్ గేమ్ అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయినా సరే నింద అంతా బీజేపీపైనే పడనుంది. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ పై ప్రజల్లో అసంతృప్తి ఉంది. షిండేను తాము సీఎం చేయలేదని మహారాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్ని కల్లో .. మహా వికాస్ ఆఘాడికి ప్రజల మద్దతు ఉంటుందన్న సర్వేలు వస్తున్న సమయంలో ఎన్సీపీని చీల్చి బీజేపీ మరో తప్పు చేసినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఆపరేషన్ కమల్ ద్వారా కూల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ప్రజల మద్దతు కోల్పోవడమే కాదు పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అదే ప్రభుత్వాన్ని కూల్చకుండా ఉన్నట్లయితే… కాంగ్రెస్, జేడీఎస్ … పై ఆ వ్యతిరేకత వచ్చి ఉండేది. బీజేపీ ఘన విజయం సాధించి ఉండేది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అంతే. మహా వికాస్ ఆఘాడి కూటమి జోలికి వెళ్లకుండా ఉన్నట్లయితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీకి చాన్స్ ఉండేది.
ఇలా ప్రభుత్వాలను కూల్చడం.. చాణక్యం అని అమిత్ షాను… ఆ పార్టీ నేతలు పొగుడుతున్నారు. కానీ అది భస్మాసుర చాణక్యం అని ఇంకా గుర్తించలేకపోతున్నారు.