భారతీయ జనతా పార్టీలో సీనియర్లను పక్కనపెట్టేయడం అనేది సాధారణ విషయంగా మారిపోయింది. మోడీ-షా ద్వయానికి పగ్గాలు వచ్చాక… ఎల్.కె. అద్వానీ లాంటి ఉద్దండులకే పార్టీలో గౌరవం దక్కని పరిస్థితి వచ్చింది. అలాంటిది, తెలంగాణకు చెందిన సీనియర్ నేత బండారు దత్తాత్రేయను పక్కనపెట్టేయడం వారికో లెక్కా..? తాజాగా ప్రకటించిన భాజపా ఎంపీ అభ్యర్థుల జాబితాలో దత్తన్నకు చోటు దక్కలేదు. ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కిషన్ రెడ్డికి అవకాశాన్ని ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పుబట్టరుగానీ, దత్తాత్రేయను పక్కనపెట్టడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
తనకు టిక్కెట్ దక్కకపోవడంపై దత్తాత్రేయ స్పందించారు. భాజపాకు తనకు చాలా అవకాశాలు ఇచ్చిందనీ, ఏనాడు టిక్కెట్ కావాలంటూ పార్టీని తాను అడగలేదన్నారు. అవమానాలను, సన్మానాలను తాను సమానంగానే చూస్తూ వచ్చానన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు టిక్కెట్ తనకు ఇవ్వలేదన్న అసంతృప్తి లేదనీ, కిషన్ రెడ్డికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ లో భాజపా అంటే బండారు దత్తాత్రేయ మాత్రమే. 1980 నుంచి ఆయన భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు.
తరం మారుతోంది కాబట్టి, నాయకులు కూడా మారడం సహజమే. కానీ, నాయకుల్ని మార్చేక్రమంలో వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని భాజపా ఇవ్వడం లేదు. సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ పరిస్థితి ఏంటో చూశాం. ఇక, ఏపీ నుంచి భాజపాలో అత్యంత క్రియాశీలంగా ఉంటూ, జాతీయ స్థాయిలో కీలకనేతగా వెలుగు వెలిగిన వెంకయ్య నాయుడుని కూడా భాజపా ఠక్కున పక్కనపెట్టేసింది. ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చి, క్రియాశీల రాజకీయాలకు దూరం చేశారు. అది కొంత నయం. కానీ, దత్తాత్రేయను మంత్రి వర్గం నుంచి అనూహ్యంగా తప్పించిన పరిస్థితి! ఇప్పుడు టిక్కెట్ ఇవ్వలేదు. భవిష్యత్తుపై భరోసా ఇచ్చిన సంకేతాలు కూడా లేవు.
తెలంగాణలో భాజపాకి ఒక పెద్దరికాన్ని తీసుకొచ్చిన నేత దత్తాత్రేయ. నిజానికి, ఇప్పటికిప్పుడు ఆయన్ని పక్కనపెట్టడం తెలంగాణలో భాజపాకి అత్యవసరమూ కాదు. ఇక్కడ కాస్తోకూస్తో ఆ పార్టీకి పాజిటివ్ ఇమేజ్ ఉందంటే ఆయనో కారణం. దత్తాత్రేయను ఠక్కున పక్కన పెట్టేయడం వల్ల ఉన్న ఆ కాస్త మంచి పేరును కూడా స్వయంగా పార్టీయే తగ్గించుకుంటున్నట్టు లెక్క. టిక్కెట్ దక్కకపోయినా పార్టీ కోసం కృషి చేస్తానని దత్తన్న చెప్పినా, ఆయన అభిమానులూ అనుచరుల స్పందన వేరేలా ఉండే అవకాశాలైతే ఉన్నాయి.