కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం .. తెలంగాణ బీజేపీకి ఇప్పటి వరకూ తెచ్చి పెట్టుకున్న హైప్ అంతా తుడిచి పెట్టుకుపోయేలా చేసింది. చేరే వాళ్లు ఎవరూ చేరకపోగా అందులో ఉన్న నేతల్ని కూడా .. ఇతరులు మోటివేట్ చేసి.. ఆ పార్టీలో ఎందుకు.. కాంగ్రెస్ పార్టీలోకి పోదాం రండి అని చర్చించుకునేలా పరిస్థితిని మార్చేసింది. బీజేపీలో చేరిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జూన్ రెండో వారంలో కాంగ్రెస్ లో చేరుతారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులు కూడా అధికార బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతారని టాక్ వినిపిస్తోంది. బీజేపీలో ఉన్న మాజీ ఎంపీలు విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈటలరాజేందర్ గురించి ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతోంది. నిన్నగాక మొన్న బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తానని కబురు పంపుతున్నారని అంటున్నారు.
బీఆర్ఎస్ టిక్కెట్లు ఖరారు చేస్తే.. టిక్కెట్ దొరకని ప్రముఖ నేతలంతా బీజేపీలోకి వస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడంతా వారు గాంధీ భవన్ ముందు క్యూ కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ త్వరలోనే.. టిక్కెట్లు ఖరారు చేయబోతున్నారు. సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు ఇస్తే చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. మఖ్యంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మరింత ఎక్కువగా ఈ సమస్య ఉంది. బలమైన నేతలు మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి సహా చాలా మంది నేతల పేర్లు ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. వీరందరితో .. కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా టచ్ లో ఉంటున్నారని చెబుతున్నారు.
బీజేపీ చేరికల వ్యూహం ఫ్లాప్ కాగా.. ఇప్పుడు ఉన్న నేతలు కూడా వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో గత ఎన్నికల నాటి స్థితికి బీజేపీ వచ్చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.