కరీంనగర్ లో జరిగిన ఒక సభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయం అవుతున్నాయి. ముస్లింలంతా మేలుకోవాలనీ, తన గొంతును బలంగా ఎంతవరకూ వినిపించగలనో తెలీదనీ, రేపు తన గొంతు ఆగిపోయినా ఆగిపోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ హక్కులను సాధించేందుకు నిరంతరం పోరాడే ఒక గొంతు ఆగిపోయినంత మాత్రాన ఏదీ ఆగిపోదనీ, ఒక అక్బురుద్దీన్ ఒవైసీ లేకపోతే వెయ్యి మంది అక్బురుద్దీన్ లు పుడతారన్నారు. అల్లాకి తాను సేవకుడననీ, తను లేకపోతే కోట్లమంది సేవకుల్ని అల్లా సృష్టించుకుంటాడన్నారు.
ఒకప్పుడు ఇక్కడ డెప్యూటీ మేయర్ (ముస్లిం) ఉండేవాడరనీ, కానీ ఇదే పట్టణంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెందిన ఎంపీ ఉన్నారని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిపై తానేం వ్యాఖ్యానించదల్చుకోలేదనీ, కానీ ఒక్క విషయాన్ని పక్కగా చెప్తాననీ, మజ్లిస్ పార్టీని ఓడించాలని మీరంతా అనుకుంటే తప్పులేదనీ, చిత్తుగా ఓడించండనీ అన్నారు. తన పార్టీని ఓటమిని అంగీకరిస్తానుగానీ, భాజపా గెలుపు తనకు ఎప్పటికీ అంగీకారం కాదని విమర్శించారు. మనలో ఐకమత్యం లేకపోతే మరొకర్ని విమర్శించడం తప్పు అన్నారు. అందరికీ అధికారమే కావాలనుకుంటే, హోదా కావాలనుకుంటే, పదవులే ముఖ్యమనుకుంటే… రండి, వచ్చి నా కుర్చీలో మీరంతా కూర్చొండి, మీ పాదాల దగ్గర కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఉద్వేగంగా చెప్పారు.
అయితే, అక్బరుద్దీన్ చేసిన ఈ ప్రసంగంపై భాజపా వెంటనే స్పందించింది. ఆ పార్టీ ప్రతినిధి కృష్ణసాగరరావు మీడియాతో మాట్లాడుతూ… అక్బరుద్దీన్ వ్యాఖ్యల వీడియో తామూ చూశామనీ, ఆయన వివాదాస్పదంగా మాట్లాడుతున్నానీ, తెలంగాణలో ఒక్క ఓల్డ్ సిటీలో తప్ప ఎక్కడా మజ్లిస్ లేదన్నారు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారన్నారు. ఆయన ప్రసంగంలో ఏవైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలుంటే కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయితే, తన ఆరోగ్య సమస్య నేపథ్యంలో అక్బురుద్దీన్ ఇలా ఎమోషనల్ గా మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో భాజపా గెలుపును తాను అంగీకరించనని అన్నారు కదా… దాన్ని టి.భాజపా నేతలు పెద్దది చేసే అవకాశం ఉంటుందేమో చూడాలి. అసలే రాష్ట్రంలో పార్టీని విస్తరించే మోడ్ లో ఉన్నారు కదా!