ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు, దాన్ని సాధించుకునే దిశగా వేసే ప్రతీ అడుగూ ఎంత శ్రద్ధగా వెయ్యాలో భాజపాని చూసి ఇతర పార్టీలు నేర్చుకోవాల్సి ఉంది! తెలంగాణలో పార్టీని విస్తరించాలనీ, మరో ఐదేళ్ల తరువాత రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేది వారి లక్ష్యం. లోక్ సభ ఎన్నికల తరువాతి నుంచి హడావుడి మొదలుపెట్టిన భాజపా… ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణలో చాలామంది నేతలు ఆ పార్టీలో కనిపిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్, టీడీపీల దీన పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని చకచకా వలసల్ని ప్రోత్సహిస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రారంభించారు. ఇప్పుడు… త్వరలో ఇక్కడ జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలపై కూడా జాతీయ స్థాయి నేతలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్టు సమాచారం!
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు గట్టి పోటీ ఇవ్వాలనీ, పెద్ద సంఖ్యలో సీట్లను దక్కించుకోవాలన్నది భాజపా లక్ష్యం. ఈ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు గెలిస్తే, గట్టి పునాది పడ్డట్టే అవుతుంది. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఢిల్లీలో కొంతమంది ప్రముఖ భాజపా నేతలు చర్చించినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వైఖరిపై ఒక ప్రణాళిక సిద్ధం చేశారనీ, దాన్ని రాష్ట్ర నేతలకు రేపు హైదరాబాద్ కి వస్తున్న భాజపా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వివరిస్తారని సమాచారం. 18, 19న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రాగానే.. ముందుగా రాష్ట్ర నేతలతో మున్సిపల్ ఎన్నికల అంశమే ప్రధానంగా చర్చించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లిలో జరిగే సభలో చేరికలుంటాయి.
కాశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు అంశాలను మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నారు. స్థానికంగా, కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నమూ చేస్తారు. సెంటిమెంట్ ని వాడుకునేందకు విమోచన దినం అంటూ కూడా హడావుడి చేయడానికి సిద్ధమౌతున్నారు. తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలపై పార్టీ జాతీయ నాయకత్వమే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందంటే… ఇంకా ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారో చూడాలి. ఏదేమైనా, తెరాసకు గట్టి పోటీ ఇచ్చే దిశగా భాజపా సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.