బీజేపీ అధికార ప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ కి నిన్న ఐసిస్ ఉగ్రవాదుల నుంచి ఒక బెదిరింపు లేఖ వచ్చింది. ఉర్దూ మరియు ఇంగ్లీష్ బాషలలో వ్రాయబడిన ఆ లేఖలో ఆయనను అసభ్య పదజాలంతో దూషిస్తూ హెచ్చరికలున్నాయని సమాచారం. పోస్ట్ ద్వారా ఆ లేఖని అయన ఇంటికి పంపబడింది. దానిని ఆయన నార్త్ ఎవెన్యూ పోలీస్ స్టేషన్ అధికారులకు అందజేసి పిర్యాదు చేసారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “నాకు గతంలో కూడా ఇటువంటి బెదిరింపు లేఖలు ఇంటర్నెట్ ద్వారా వచ్చేవి. ఇటువంటి బెదిరింపులకి నేను భయపడేది లేదు. నా జాతీయ దృక్పధంలో నేను ముందుకు సాగిపోతాను,” అని అన్నారు. షా నవాజ్ హుస్సేన్ కి అందిన బెదిరింపు లేఖ ఎక్కడి నుంచి ఎవరు పోస్ట్ చేసారనే దానిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
గత కొన్ని రోజులుగా భారత్ లో ముఖ్యనేతలకు ఐసిస్ ఉగ్రవాదుల నుండి బెదిరింపు లేఖలు రావడం మొదలయ్యాయి. ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోడి, రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్కోస్ హోలండి పేరిట ఫ్రాన్స్ దౌత్యకార్యాలయానికి ఐసిస్ ఉగ్రవాదుల పేరిట బెదిరింపు లేఖలు వచ్చేయి. అన్ని లేఖలు పోస్ట్ ద్వారానే సంబంధిత వ్యక్తులకు చేరవేయబడుతున్నాయి. అంటే ఐసిస్ సానుభూతిపరులు దేశంలో చాప క్రింద నీరులా విస్తరిస్తున్నారని స్పష్టం అవుతోంది. ఇటీవల కాలంలో ఐసిస్ లో చేరేందుకు దేశం నుంచి బయలుదేరుతున్న విద్యాధికులయిన ముస్లిం యువత సంఖ్య కూడా పెరుగుతోంది. కనుక ఈ ఐసిస్ ఉగ్రవాదాన్ని ఆదిలోనే కట్టడి చేయలేకపోతే ఆ తరువాత దానిని అదుపు చేయడం చాలా కష్టం అవుతుంది.