పోలవరం ప్రాజెక్టు వ్యవహారం భాజపా, టీడీపీల మధ్య కాస్త బిగుసుకుంటోంది. సాయం చేయలేమని కేంద్రం చెబితే, ఓ నమస్కారం పెట్టి వారికే అప్పగించేద్దాం అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకి దారి తీశాయి. నిజానికి, ఈ కొత్త టెండర్ల విషయమై ఈ మధ్యనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గట్కరీని చంద్రబాబు కలిశారు. సో.. కొత్త టెండర్లకు ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. కానీ, ఈ వ్యవహారంలో కేంద్రం ట్విస్ట్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి..? ఇదే విషయమై ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరతారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే చాలా రోజులైంది. ఏపీ సీఎంకు ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం లేదనే చర్చ కూడా ఉంది. కేంద్రమంత్రి నితిన్ గట్కరీ కూడా ప్రస్తుతం అందుబాటులో లేరని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం వైఖరి ఏంటనేది స్పష్టంగా తెలియడం లేదు. నిజానికి, ఇది జాతీయ ప్రాజెక్టు. నిర్మాణ బాధ్యతలు వారివే. నీతీ ఆయోగ్ చెప్పింది కాబట్టీ, టీడీపీ వారి భాగస్వామ్య పక్షం కాబట్టి నిర్మాణ బాధ్యతల్ని ఏపీకి ఇచ్చారు. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ క్రెడిట్ మొత్తం భాజపాకి దక్కుతుందా అనే అనుమానాలు ఢిల్లీ పెద్దలకు ఉన్నట్టు సమాచారం. పోలవరం పూర్తయితే దేశవ్యాప్తంగా దీని గురించి మోడీ ఘనంగా ప్రచారం చేసుకోవచ్చని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి టీడీపీ నేతలు ఇప్పుడు అంటున్నారు. కానీ, ఈ ప్రాజెక్టులో మొదట్నుంచీ మోడీ పేరు వినిపించకుండా చేశారని ఏపీ భాజపా నేత సోము వీర్రాజు అభిప్రాయపడుతున్నారు. పోలవరంపై కేంద్రం కొర్రీలు పెట్టడం వెనక రాజకీయ కోణం చాలా స్పష్టంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎలాగూ ఆ క్రెడిట్ తమకు దక్కే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి, నిర్మాణ వ్యయ భారాన్ని వీలైనంత తగ్గించుకునే వ్యూహాంలో కేంద్రం ఉన్నట్టుగా కూడా అనిపిస్తోంది. పునరావాసం, సహాయ చర్యల ఖర్చులను కేంద్రం లిస్టులోంచి తీసేశారు. కాపర్ డామ్ లు అవసరం లేదని వారే చెప్పారు. జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో కూడా మొదట్నుంచీ తప్పుకున్నారు. ఇంకోపక్క, 2014 అంచనాలకే చెల్లింపులు చేస్తామని ఆ మధ్య అన్నారు. ఈ రకంగా కేంద్రం వైఖరి ఏంటనేది దశలవారీగా స్పష్టం అవుతూనే ఉంది.
ఇక, ప్రస్తుత కార్యాచరణ విషయానికొస్తే… ఏపీలో పోలవరం గురించి ఇంత చర్చ జరుగుతున్నా, ఢిల్లీ పెద్దలు దీని గురించి ప్రస్తుతం పట్టించుకునే పరిస్థితిలో లేరనే చెప్పాలి. వారి ఫోకస్ అంతా ఇప్పుడు గుజరాత్ ఎన్నికలే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా అక్కడే చక్కర్లు కొడుతున్నారు. ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల్లో మరోసారి విజయం సాధించిన ఉత్సాహంలో భాజపా నేతలున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం గురించి పట్టించుకునే పరిస్థితి కొన్నాళ్లపాటు ఉండదనే చెప్పాలి. పోలవరం పనులు యథాతథంగా జరగాలంటే కేంద్రమంత్రి రావాలి, రాష్ట్ర నేతలతో మరోసారి భేటీ జరగాలి. అక్కడ అన్నీ సక్రమంగా జరిగితే పనులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇంత భారీ ప్రాజెక్టు పూర్తి చేసినా భాజపాకి ఒరిగేది ఏదీ ఉండదనే భావన రాష్ట్ర నేతలతోపాటు ఢిల్లీ నేతల్లోని ఉందనే అభిప్రాయమే రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. సో… పోలవరంపై భాజపా ప్రస్తుత వైఖరి ఇదే అని చెప్పాలి.