బీజేపీకి ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి రాజకీయ ఆశలు లేవు. కేంద్రం నుంచి ఎంత చేసినా అది తెలుగుదేశానికే ఉపయోగపడుతుంది. తమకు పెద్దగా ప్రయోజనం వుండదని బిజెపి విశ్లేషణ. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చే కొద్దిపాటి సీట్లతో కేంద్రంలో తమకి ఒరిగేదీ లేదని కూడా వారు భావిస్తున్నారు. బిజెపి సొంత కాళ్లమీద నిలబడగలిగే పరిస్థితి లేని ఆంధ్రప్రదేశ్ లో హోదా అనే తేనెతుట్టెని కదిపి ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయంగా వత్తిళ్ళకు గురవ్వడం అనవసరమన్న నిర్ణయానికి మోదీ బృందం వచ్చేసింది.
అదే బృందగానాన్ని రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వినిపించారు.ప్రత్యేక హోదా ఇవ్వడంలో లోతుపాతులు వివరిస్తూనే దీనికి పరిష్కారం వెతకాలంటూ కేంద్రప్రభుత్వం రెండేళ్ళుగా నిరాశ వెనుక చిన్న ఆశని అతికిస్తోంది. దాన్ని తుంచి వేయడం వల్ల తెలుగుదేశం తో వచ్చే మార్పులకు సిద్ధపడే రాజ్యసభలో విషయం తేల్చేసింది.
ఈ విధంగా బంతి తెలుగుదేశం ముందుకి వచ్చేసింది. ఎటు? ఎలా? విసరాలో చంద్రబాబునాయుడే నిర్ణయించుకోవాల్సి ఉంది. ఆయనది కత్తిమీద సామే. కేంద్రంతో పోరాటం చేయాలని నిర్ణయిస్తే అది ఎందాకా పోతుందో తెలీదు. ఒకసారి దిగాక రాజకీయ పోరాటం చేయాల్సిందే. అదీ రాష్ట్రస్ధాయిలో కాదు. జాతీయస్ధాయిలో. ఢిల్లీలో చంద్రబాబుకి చక్రం తిప్పటం కొత్తేమీ కాదు. యునైటెడ్ ఫ్రంట్‌లాంటి ఫ్రంట్లను ఒంటిచేత్తో నడిపిన రికార్డు ఉండనే ఉంది. చంద్రబాబుకి ఢిల్లీలో ఒక బ్రాండ్ ఇమేజీ ఉంది. దాంతో ఆయన ప్రతిపక్షాలను కూడగట్టగలరు.
అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎదుర్కోగల అవకాశాలున్న ముఖ్యమంత్రులు చాలా తక్కువమందే ఉన్నారు. మమతాబెనర్జీ, నితీష్‌కుమార్ మాత్రమే కనిపిస్తున్నారు. నవీన్ పట్నాయక్ స్వతంత్రంగా ఉండాలనుకుంటారు గాని ఆయన రాష్ట్రం విడిచివచ్చే స్ధాయి లేదు. ఇక జయలలిత అనారోగ్యంతో రాష్ట్రానికే పరిమితమయ్యారు. కెజ్రీవాల్ కెమిస్ట్రీ ఇంకా ఆయన సహచరులకే అంతు చిక్కడంలేదు. ఉమ్మడి ప్రయాణానికి ఆయన ఎంత వరకూ కలసి వస్తారో తెలియదు. చంద్రబాబు కూడా కలిస్తే ముగ్గురు మాత్రమే తేలుతున్నారు. పోరాటమంటూ మొదలైతే వచ్చే ఎన్నికల దాకా సాగాలి. నరేంద్రమోదీ కక్షసాధింపు మొదలు పెడితే ఆలా ఇలా వుండదు.
రాజధానితో సహా రాష్ట్రాన్ని నిర్మించేపనిలో వున్న చంద్రబాబు జాతీయరాజకీయాల్లో ఏమాత్రం సమయాన్ని వెచ్చించగలరు? కేంద్రం సహాయనిరాకరణ మొదలు పెడితే దాన్ని అధిగమించడం ఎలా?
ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే!
జైట్లీ సమాధానంతో చంద్రబాబు కూడా అసహనానికి గురయ్యారు. ఆయన నిరసన వెలిబుచ్చిన తీరుని బట్టి చంద్రబాబు కొత్త పోరాటపంథాలోకి అడుగుపెట్టినట్టే భావించాలి. మొత్తానికి జైట్లీ ప్రకటన తర్వాత చంద్రబాబు ఏదొక ప్రతిస్పందన చూపకపోతే అది రాజకీయంగా చంద్రబాబుకి నష్టదాయకమే అవుతుంది.
మరి ఇపుడు కేంద్రంలో వున్న తెలుగుదేశం మంత్రులు రాజీనామా చేస్తారా? ఎన్డీయేకి వెలుపలి నుంచి మద్దతు ఇస్తూ బీజేపీతో శాశ్వత తెగతెంపులు చేసుకోకుండా ఢిల్లీలో ప్రధానమంత్రితో మైత్రీబంధాన్ని భవిష్యత్తు అవసరాలకోసం సజీవంగా ఉంచుకుంటారా? ఏమైనా అది ఏక్షన్ గానే వుండాలి. ప్రకటనల రూపంలో నిరసన చెప్పే దశ దాటిపోయింది.
ఇది తెలుగుదేశానికీ, చంద్రబాబు నాయుడుకీ పరీక్షాసమయమే!