రాజకీయాలు అంటే ఇంతే. కేంద్రం గత నాలుగైదేళ్లలో ఇబ్బడిమబ్బడిగా ఎక్సైజ్ టాక్స్‌లు, సెస్‌లు విధించి పెట్రో ధరలతో ప్రజల్ని బాదేసింది. కేంద్రం పెంచిన నిష్పత్తిలోనే రాష్ట్రాలూ దోచుకున్నాయి. ఇప్పుడు కొత్తగా కేంద్రం మేము తగ్గిస్తున్నాం.. మీరు తగ్గించండి అంటూ పొలిటికల్ గేమ్ ప్రారంభించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా వరకు పన్నులను తగ్గించాయి. బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రం తగ్గించినట్లుగా రాష్ట్రాలు కూడా తగ్గించాలని బీజేపీ పోరాటాలు ప్రారంభించింది.
తెలంగాణలో ప్రభుత్వం పెట్రోల్ పై 35.20 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31 శాతం వ్యాట్‌తో పాటు ఒక్క లీటర్ మీద అదనంగా నాలుగు రూపాయల వ్యాట్ విధించింది. అలాగే రోడ్ల మరమ్మతుల నిధుల కోసమని లీటర్‌కు మరో రూపాయి సెస్ వసూలు చేస్తోంది. అందుకే తెలంగాణకు.. ఏపీకి మధ్య పెట్రోల్ రేట్లలో రూ. రెండు, మూడు రూపాయల తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కేంద్రం పన్నులను తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించాలని సూచించింది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంత వరకూ తగ్గిస్తామని కానీ.. తగ్గించే ఆలోచన చేస్తామని కానీ చెప్పడం లేదు.
ఇది బీజేపీకి గొప్ప అవకాశంగా మారింది. తెలంగాణ బీజేపీ ఈ అంశంలో మరింత దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనలకు పిలుపునిచ్చారు. అయితే ఎన్నికల వ్యూహంతోనే బీజేపీ ఇలా చేస్తోందని.. తమకు ఎన్నికలు లేనందున ఆ అవసరం లేదని చాలా రాష్ట్రాలు భావిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో ఉన్నాయి. రాజకీయం కోసమో.. మరో కారణమో కాని అలవి మాలిన అప్పులు చేసి ఆదాయం పెంచుకునే పరిస్థితి లేక అప్పులపై ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రో ధరలపై పన్ను తగ్గిస్తే ఆ భారం ఎక్కువగా ఉంటుంది. అందుకే తగ్గించే ఆలోచన చేయడం కష్టం. అయితే పన్నులు తగ్గించాలన్న రాజకీయ పార్టీల డిమాండ్‌కు ప్రజలు కూడా గొంతు కలిపితే ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి.