ఎలాగో ఒకలా భాజపా మార్కు హిందుత్వ అంశాన్ని తెలంగాణలో జొప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. హిందుత్వ పరిరక్షణకు తామే పూనుకున్నామని చాటిచెప్పే ప్రయత్నం పదేపదే చేస్తున్నారు. అలాంటి మరో ప్రయత్నమే మరోసారి చేశారు. నిజామాబాద్ లో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువు ఎలా అవుతారంటూ విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అసదుద్దీన్ ఒవైసీ నడిపిస్తున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఒవైసీతో మూడేసి గంటలు చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం కేటాయిస్తుంటారనీ, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలూ మంత్రులతో మూడు నిమిషాలు కూడా మాట్లాడటానికి ఇష్టపడరన్నారు.
సీఎం కేసీఆరే పెద్ద ముస్లిం అనీ, ఒవైసీ కన్నా పెద్ద ముస్లిం అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కానీ, తనకంటే గొప్ప హిందువు లేడన్నట్టుగా ఆయన యజ్ఞ యాగాలు పెద్ద ఎత్తున చేస్తుంటారనీ, రాక్షసులు కూడా ఇలానే భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు చేస్తారని కేసీఆర్ కి తెలియదేమో అంటూ ఎద్దేవా చేశారు. దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే భద్రాచలంలో ప్రతీయేటా జరిగే శ్రీరాముడి కల్యాణానికి తలంబ్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి దంపతులు వెళ్లడం ఒక ఆనవాయితీ ఉందనీ, అది ఈ ప్రాంత ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశమన్నారు. కానీ, నువ్వు వెళ్లకుండా మనవడితో పంపిస్తే నువ్వు హిందువు ఎట్లవుతావని ప్రశ్నిస్తున్నా అన్నారు లక్ష్మణ్? ఇలాంటి చర్యల ద్వారా హిందువుల మనోభావాలను కేసీఆర్ దెబ్బ తీస్తున్నారని విమర్శించారు.
భాజపా మార్కు ప్రయత్నమంటే ఇదే..! దక్షిణాదిలో లేని హిందుత్వ అంశాన్ని బలవతంగా రుద్దే ప్రయత్నంలా కనిపిస్తోంది. కేసీఆర్ ముస్లిం అనీ, హిందూ వ్యతిరేకి అని బహిరంగానే ఆరోపించే దశకు లక్ష్మణ్ వచ్చేశారు. నిజానికి, ఆ మధ్య యాదాద్రి ఆలయంలో సంస్కృతీ సంప్రదాయాలను కేసీఆర్ మంటగలుపుతున్నారనీ, హిందుత్వ వ్యతిరేక చర్యలు చేస్తున్నారంటూ ఇలాగే తీవ్రంగా ఆరోపించారు. ఇప్పుడు శ్రీరాముడిని తెర మీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భద్రాద్రిని దక్షిణ భారత అయోధ్య అంటూ… ఒక ఎమోషనల్ కనెక్షన్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు! భాజపా గట్టి ప్రయత్నమే చేస్తున్నా… ఈ కోణంలో ప్రజల నుంచి ఇంతవరకూ ఎలాంటి సానుకూల స్పందనైతే భాజపాకి లేదు! ఇలా అదేపనిగా రుద్దుతూపోతే మున్ముందు ఏమౌతుందో చూడాలి.