లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. మోదీ హవా, రామమందిరం ట్రాన్స్తో కనీసం పది సీట్లను గెల్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ రాజకీయ పరిస్థితులు మాత్రం.. రెండు పార్టీల మధ్య పోరాటంలా మారుతోంది. లోక్ సభ ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్కు అసలు చాన్స్ ఉండదని రెండు జాతీయ పార్టీల మధ్య పోరాటం జరుగుతుందని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ బలంగా కాంగ్రెస్ తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజలు.. ఓటర్లు బీజేపీ వైపు ఆలోచించకుండా రాజకీయాలు సాగుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ మెల్లగా సైడ్ ట్రాక్ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడటంతో బీఆర్ఎస్ రేసులోకి వచ్చేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఆ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు అధికార పార్టీ అదే దూకుడు ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ వెనుకబడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు, కాళేశ్వరం విషయంలో బీజేపీ తన వాదనను సమర్థంగా వినిపించలేకపోయింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే సమరం సాగుతోందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది.
తెలంగాణలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యే ఏదో పోరాటం నడుస్తోందని.. రెండు పార్టీల మధ్యే యుద్ధం జరుగుతోందని అనిపించడానికి.. కృష్ణా ప్రాజెక్టులు, మేడిగడ్డతో పాటు ఇతర అంశాలతో రాజకీయం చేస్తున్నారని బీజేపీ అనుమానిస్తోంది. అసలు లేని వివాదాన్ని తెరపైకి తెచ్చి సభలు.. సమావేశాలు పెట్టుకుంటున్నారని.. ఇదంతా లోక్ సభ ఎన్నికల రాజకీయం అని గట్టిగా నమ్ముతోంది. కానీ.. కౌంటర్ ఇవ్వడానికి మాత్రం ఆ పార్టీకి సరైన అవకాశం .. వాయిస్ దొరకడం లేదు. ప్రజలకు ఎలా చెప్పాలో మాత్రం వారికి అర్థం కావడం లేదు.