పవన్ కల్యాణ్ సంపూర్ణ సనాతనిగా మారే విషయంలో తెర వెనుక ఏం జరిగిందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కల్యాణ్ కేవలం ఏపీకి..లేకపోతే తెలుగు రాష్ట్రాలపై తన ఫోకస్ పెట్టలేదు. తమిళనాడుపైనా ఉత్తరాదిపైనా ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. అందుకే పవన్ కల్యాణ్ కొత్త తరహా కాషాయ రాజకీయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది.
పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఇలా పూర్తిగా కాషాయధారిగా మారిపోవడం వెనుక బీజేపీ సిద్ధాంతకర్తల వ్యూహం ఉందన్న అనుమానాలను రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. హఠాత్తుగా పవన్ సనాతన ధర్మం గురించి ఉద్యమం ప్రారంభించడానికి వెనుక లోతైన .. దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉంటుందని అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడున్నర నెలలు మాత్రమే. ఆయన ఇంకా తనదైన ముద్ర వేయలేదు. ఈ లోపే సనాతన ధర్మ రక్షణ వైపు అడుగులేశారు.
తిరుపతిలో జరిగిన సభలో రాముడి విషయంలో రాహల్ గాంధీ పైనా విమర్శలు చేశారు. తమిళనాడులో బీజేపీ భావజాలం మరింత బలపడేలా .. డీఎంకే కొత్త నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్నీ ఖండించారు.
అంటే ఆయన బాట చాలా క్లియర్ గా ఉంది. బీజేపీతో ఆయన బంధం మరింత గట్టి పడిందని అనుకోవచ్చు. మొత్తంగా పవన్ సనాతన ధర్మ పోరాటం ఆషామాషీ కాదని చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని .. అంతా బీజేపీ కనుసన్నల్లోనేజరుగుతోందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.