భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మిత్రుల కోసం… పరుగులు పెడుతోంది. కొత్త మిత్రులు రావడం లేదు. కానీ పాత మిత్రులను నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో… సీట్ల కోసం.. ఆయా పార్టీలు ఒత్తిడి చేయడం కూడా ఎక్కువ అయింది. శివసేన విషయంలో బీజేపీ ఇంకా ఏ ముందడుగు వేయలేకపోయింది. కానీ బీహార్ విషయంలో మాత్రం ఓ ఓడంబడిక చేసుకున్నారు. దాని ప్రకారం చూస్తే.. బీజేపీ మిత్రులకు లొంగిపోయినట్లుగా కనిపిస్తోంది.
బీహార్‌లో ఐదు సిట్టింగ్ సీట్లను బీజేపీ వదులుకోవడానికి కారణం ఏమిటి..?
బీహార్‌లో 40 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇందులో 17 స్థానాల్లో బీజేపీ, 17 స్థానాల్లో జేడీయూ…మరో ఆరు స్థానాలలో రామ్ విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ పోటీ చేయనుంది. అందుకే ఇక్క తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే… బీజేపీకి బీహార్‌లో 22 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేయలేదు. అప్పుడు విడిగా పోటీ చేశాయి. బీజేపీ.. ఎల్జేపీతో పాటు.. ఇతర చిన్న పార్టీలతో కలసి పోటీ చేసి.. తను సొంతంగా 22 సీట్లు తెచ్చుకుంది. కానీ జేడీయూ ఒంటరిగా పోటీ చేసి 2సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. కానీ పదహారు శాతం ఓట్లు వచ్చాయి. అంతకు ముందు బీజేపీ, జేడీయూ పొత్తులు పెట్టుకున్న పార్టీలే. అప్పట్లో జేడీయూ మేజర్ పార్టీ. బీజేపీని వదిలేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయింది. అయినప్పటికీ.. బీజేపీ పదిహేడు పార్లమెంట్ సీట్లను.. జేడీయూకి ఇచ్చింది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం.. బీజేపీ తన సిట్టింగ్ సీట్లు ఐదింటిని మిత్రపక్షాలకు ఇచ్చింది.
మిత్రపక్షాలు లేకపోతే 2019లో అధికారం అసాధ్యమా..?
నరేంద్రమోడీ, అమిత్ షాల నేతృత్వంలోని… ఎన్డీఏకు… మొదటి నుంచి మిత్రులను గౌరవంగా చూసిన చరిత్ర లేదు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఎప్పుడూ.. మిత్రపక్షాలను సంప్రదించినదీ లేదు. అందుకే.. శివసేన ఒంటరిగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించింది. టీడీపీ నమస్కారం పెట్టేసింది. కశ్మీర్ లో పీడీపీతో బీజేపీ మరింత అవమానకరంగా ప్రవర్తించింది. చివరికి నిన్నటికి నిన్న బీహార్‌లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ని కూడా.. ఉంటే ఉండు పోతే పో అని పంపించేశారు. బీహార్ లో జేడీయూ గుడ్ బై చెప్పినప్పుడు.. ఆల్ఎల్ఎస్పీ సహా ఇతర పార్టీలు కలసి వస్తేనే..బీజేపీ విజయం సాధించగలిగింది. కానీ ఇప్పుడు జేడీయూ, ఎల్జేపీ విషయానికి వచ్చేసరికి.. అమిత్ షా హుటాహుటిన బీహార్ వెళ్లి సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. అంటే.. 2019 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మిత్రుల మద్దతు తప్పని సరి అన్న విషయం వారికి అర్థం అయింది. వారికి ఇప్పుడు తత్వం బోధపడింది. మిత్రుల అవసరం ఏమిటో తెలిసి వచ్చింది. దీన్ని బీజేపీ గుర్తించింది. అందుకే సిట్టింగ్ సీట్లను కూడా మిత్రపక్షాలకు ఇచ్చేసింది.
మిత్రపక్షాల బెదిరింపులకు బీజేపీ భయపడుతోందా..?
సాధారణంగా మిత్రపక్షాలు… సీట్ల సర్దుబాటు అంశాలను చర్చించాలంటే.. ముందుగా ఎవరి సిట్టింగ్ సీట్లను వారు తీసుకుంటాయి. మిగిలిన సీట్లలో బేరం ఆడుకుంటాయి. కానీ.. ఇప్పుడు. బీజేపీ ఐదు సిట్టింగ్ సీట్లను.. ఇచ్చేసింది. అంటే.. మిత్రులు లేకపోతే.. తమ మనుగడ ప్రశ్నార్థకం కావొచ్చనేది వారి భయమే కదా..! అదే సమయంలో… మిత్రపక్షాలు కూడా.. ఓ రకంగా..బీజేపీకి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాయి. సీట్ల సర్దుబాటును ఆలస్యం చేస్తూండటంతో.. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు.. చిరాగ్ పాశ్వాన్… నోట్ల రద్దు అంశంపై … ఓలేఖ రాశారు. నోట్ల రద్దు వల్ల వచ్చిన ప్రయోజనాలేమిటో…చెబితే.. వాటిని ప్రజలకు చెబుతామంటూ లేఖ రాశారు. అదే సమయంలో నితీష్ కుమార్ కూడా… నోట్ల రద్దుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే వీరిద్దరూ ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేశారన్నమాట. వెంటనే అమిత్ షా.. వెళ్లి ఎలాగోలా సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. అంటే.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తగ్గినట్లుగానే… బీజేపీ మిత్రపక్షాలకు తగ్గుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా మిత్రులతో ఇలాగే వ్యవహరిస్తే.. బీజేపీకి గట్టి పోటీ ఇస్తుంది. కానీ వచ్చే మిత్రులు వస్తారు.. లేకపోతే లేదు..అన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం… కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావొచ్చు.