మరోసారి ఆంధ్రాలో పొత్తుల చర్చ ప్రముఖంగా జరగనుంది. ఎందుకంటే, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఒక జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘భాజపాతో కలిసి ప్రయాణించేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామ’ని చెబుతూ.. ‘ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తేనే’ అనే షరతు కూడా పెట్టారు! విభజన తరువాత ఆంధ్రా బాగా వెనకబడిపోయిందనీ, ప్రత్యేక హోదా ఒక్కటే రాష్ట్రానికి సంజీవని అని కూడా అన్నారు. జగన్ ఇలా వ్యాఖ్యానించిన తరువాత.. దీనిపై పలువురు టీడీపీ నేతలూ భాజపా నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కన జగన్ ను ఊహించుకోవడమే కష్టసాధ్యంగా ఉందని ఏపీ భాజపా మంత్రి కామినేని వ్యాఖ్యానించారు. అవినీతి రహితంగా మోడీ సర్కారు పాలన ఉంటుందనీ, వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ తో పొత్తు ఎలా సాధ్యమంటూ ఆయన వ్యాఖ్యానించారు. పురందేశ్వరి కూడా స్పందించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమనీ, దాన్ని మించిన ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రాకి కేంద్రం కల్పించిందన్నారు. ప్యాకేజీని ముఖ్యమంత్రి కూడా మెచ్చుకున్నారనీ, ఇలాంటి సందర్భంలో మళ్లీ హోదా చర్చ అర్థం లేనిదని ఆమె వ్యాఖ్యానించారు.
రాష్ట్ర స్థాయిలో స్పందనలు ఎలా ఉన్నా… జగన్ వ్యాఖ్యలపై ఢిల్లీలో ఏవైనా చర్చ జరుగుతోందా లేదా అనేదే ముఖ్యమైంది. నిజానికి, పొత్తుల విషయమై భాజపా ప్రస్తుతం దృష్టి సారించే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే, మిత్రపక్షమైన శివసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండదనీ, సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించింది. కనీసం దీనిపై అయినా భాజపా నేతలు ఎవ్వరూ స్పందించలేదు. కాబట్టి, జగన్ వ్యాఖ్యలను ఢిల్లీలో సీరియస్ గా తీసుకునే పరిస్థితి అక్కడ ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. అయితే, ఆంధ్రాలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనే విషయమై భాజపాకి ఒక వ్యూహం కచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎన్నికలు వచ్చేవరకూ పొత్తుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడమే ఆ వ్యూహం! గోడ మీద పిల్లి వాటం ప్రదర్శించడమే ఆ ఎత్తుగడ.
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కొనసాగుతుందా.. అంటే, కమలనాథులు కూడా ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు, కేంద్రం కేటాయింపుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తిగానే ఉంటూ, ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల వచ్చేలోగా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కకకపోతే భాజపాతో టీడీపీయే తెగతెంపులు చేసుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఇంకోటి… టీడీపీతో పొత్తు కంటే, వైకాపాతో జతకట్టడం ద్వారా ఏపీలో అత్యధిక స్థానాలను దక్కించుకోవచ్చనే ఆలోచన కూడా భాజపాకి లేదని చెప్పలేం కదా! ఆ మధ్య జగన్ కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కోవింద్ కు జగన్ సాష్టాంగ దండప్రణామాలు చేసే అవకాశం కల్పించడం… ఇవన్నీ భాజపా వ్యూహాత్మక చర్యలుగానే చెప్పుకోవచ్చు. సో.. జగన్ కు భాజపా అవసరమే కావొచ్చు.. కానీ, భాజపాకి ఆంధ్రాలో ఎవరు అవసరం అనేది ఇంకా తేాలాల్సిన లెక్కగానే ఉంది.
కొసమెరుపు ఏంటంటే… ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తామని జగన్ చెప్పుకొస్తున్నారు కదా. దాని కోసం చివరి అస్త్రంగా ఎంపీలు రాజీనామాలు చేస్తారని ఎప్పుడో చెప్పారు. అయితే, ఇప్పుడు హోదా గురించి మాట్లాడుతూ… రాజీనామాల అంశాన్ని పక్కనపెట్టేసి.. హోదా ఇస్తే భాజపాతో కలిసి పనిచేస్తామని చెబుతుండటం గమనార్హం!