వైఎస్ఆర్సిపికి బిజెపి ఆధ్వర్యంలోని మోడీ ప్రభుత్వానికి మధ్య రాష్ట్రపతి ఎన్నికల పేరిట ఏర్పడిన సంబంధం వూరికే పోదని ఇరు పక్షాలూ భావిస్తున్నాయి. బిజెపి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భాగస్వామిగా వున్నా స్వంత గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నది. ఆ పార్టీలో రెండు మూడు రకాల మాటలు వినిపిస్తుంటాయి. అయితే అందరూ తమ స్వంత పునాది బలపర్చుకోవలసిందేనని, టిడిపికి ఉపగ్రహాలుగా వుండరాదని అంటుంటారు. ఈ క్రమంలో ఒక వర్గం స్వరం పెంచుతుంటుంది. ఆ వెంటనే చంద్రబాబు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ద్వారానో మరో విధంగానో కాస్త తగ్గింపచేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇది నిరంతర ప్రహసనమే. అయితే జగన్ మోడీ భేటీ ఈ పరిస్థితిలో కొత్త మలుపు తెచ్చింది.
రాష్ట్రపతి అభ్యర్థి పర్యటన సందర్భంగా స్వయంగా వెంకయ్య నాయుడే జగన్తో కలసి పాల్గొనడం టిడిపికి జీర్ణం కాని విషయమే. వామపక్షాలు ఎలాగూ బిజెపితో చెలిమిని హర్షించవు. కాని ఇక్కడ టిడిపిపై ప్రభావమే ముఖ్యమవుతుంది. ఎందుకంటే వారితో కలసి వున్నారు గనక! బిజెపి అద్యక్షుడు అమిత్ షాతో సహా ఎవరైనా సరే ఎన్నికల వరకూ ప్రభుత్వంలో వుంటామని అంటారు గాని తర్వాత మాట చెప్పరు. అయితే వాస్తవికంగా ఆలోచిస్తే అంత తేలిగ్గా బిజెపి ఎపిలో టిడిపిని వదలిపెట్టకపోవచ్చు. అయితే అర్థమనస్కంగానైనా చెలిమి కొనసాగించవచ్చు.అయితే తామే సృష్టించిన ఈ పరిస్థితిని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది.అంటే ఒక వేళ వచ్చే ఎన్నికలలో టిడిపితో పొత్తు కొనసాగించినా మరిన్ని సీట్లకోసం విపరీతమైన ఒత్తిడి పెంచుతుంది. అసెంబ్లీ సీట్లు పెంచి వాటిలో తన వాటా పెంచాలని పటు ్టపడుతుంది. లేకపోతే జగన్తోనో పవన్ కళ్యాణ్తోనో వెళతామని బెదిరిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ మూడు శక్తులు కలిసినా అయిదు లక్షల ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. తర్వాత యాంటీ ఇంకంబెన్సీ వుండనే వుంటుంది. కాబట్టి టిడిపి అవసరాన్ని బట్టి బిజెపి సీట్ల బేరం బిగిస్తుందనే ఆ పార్టీ నాయకులొకరు అన్నారు.