ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల్ని పక్కాగా ఉపయోగించుకోవడానికి బీజేపీ రెడీ అయిపోయింది. ఇందు కోసం ఢిల్లీలో ప్రత్యేకంగా ఓ టీమ్ పని చేస్తోంది. హైకమాండ్ నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉన్నతస్థాయి నేతల వరకూ అనేక రకాల ఆలోచనల్ని కలిపి.. ఓ కార్యచరణ సిద్ధం చేశారు. ఆదివారం పూట తిరుపతిలో ఈ మేరకు ప్రత్యేకమైన సమావేశం నిరవహిస్తున్నారు. కేంద్ర పార్టీ నుంచి కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతోపాటు హిందువులకు రక్షణగా బీజేపీ అండగా ఉంటుందనే సంకేతాలు పంపించే దిశగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని బీజేపీ నిర్ణయించుకుంది.
హిందూ ధర్మ పరిరక్షకులం తామేనని చెప్పుకుంటూ బస్ యాత్ర చేయాలని కూడా భావిస్తున్నారు. అయితే బస్సు యాత్ర.. దాడులు జరిగిన ఆలయాలకు ఉండాలా.. లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలా అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఇది చక్కని అవకాశమని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. టీడీపీ ద్వితీయశ్రేణి నేతలను, పార్టీకి దూరంగా ఉన్నవారిని తమవైపుకు తిప్పుకోవాలని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించింది. తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేసి ఆ స్థానంలోకి తాము వెళ్లాలనేది బీజేపీ లక్ష్యం.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతోనే ఆ దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి అక్కడ కార్యాలయాన్ని కూడా సిద్ధం చేసుకుంది. ఇప్పుడు టీడీపీ నుంచే బలమైన అభ్యర్థిని బీజేపీలోకి లాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. పదో తేదీన.. బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుని కార్యాచరణ ప్రకటించబోతున్నారు. మరో వైపు.. ఆలయాలపై దాడులకు బీజేపీనే కారణమని.. వైసీపీ సహకరిస్తోందని.. విస్తృతంగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేలా కూడా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.