భారతీయ జనతాపార్టీ ఉత్తరాదిలో ఓ పార్టీగా ప్రజల్లోకి వెళ్లిందంటే దానికి కారణం రాముడి గుడి. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రాముడి గుడి కట్టిస్తామంటూ ప్రజల్లో భావోద్వేగాలు, రథయాత్రలతో రెచ్చగొట్టి… తమ ఓటు బ్యాంక్‌ను సుస్థిరం చేసుకున్నారు. కానీ ఆ రాముడి సెంటిమెంట్ దక్షిణాదిలో వర్కవుట్ కాలేదు. దక్షిణాదిలోనూ బలంగా అడుగు పెట్టాలనుకుంటున్న ఆ పార్టీకి ఇప్పుడు రాముడికి బదులుగా శ్రీనివాసుడు దొరికాడని ప్రచారం జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల వారికి శ్రీవారు కొంగు బంగారం. ఆయనపై అమితమైన భక్తి విశ్వాసాలను ప్రజలు చూపిస్తూంటారు. అలాంటి ఆలయంపై వివాదాలు రేకెత్తించి.. హిందువుల్లో అలజడి రేపి… ఓటు బ్యాంక్‌ను పెంచుకోవాలన్న కుట్ర చేస్తోందన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి.
కొద్ది రోజులుగా తిరుమల శ్రీవారి పేరుతో అవాంఛనీయమ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆలయాన్ని స్వాధీనం చేసుకుందామని… పురావస్తు శాఖ ద్వారా…నోటీసులు పంపారు. ప్రజల నుంచి ఊహించని ఆగ్రహం వ్యక్తం కావడంతో అప్పటికప్పుడే వెనక్కి తగ్గారు. తిరుమలకు అమిత్ షా వచ్చి.. ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులలతో చర్చించి వెళ్లిన తర్వాత… పరిణామాలు మరింత వేగంగా మారిపోతున్నాయి. రమణదీక్షితులు ఎవరో చెప్పినట్లు… తమిళనాడు వెళ్లి తమిళంలో టీటీడీపై ఆరోపణలు చేశారు. ఢిల్లీ వెళ్లి ఇంగ్లిష్, హిందీ మీడియాకు చెప్పారు. విజయవాడలోనూ అదే చెప్పారు. ఈ ఆరోపణలు చేసిన తర్వాతనే రమణదీక్షితులకు టీటీడీ రిటైర్మెంట్ ఇచ్చింది. అప్పటి వరకు దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఆయనే శ్రీవారికి ప్రధాన అర్చకులు.
శ్రీవారి పూజలు, కైంకర్యాలు గురించి లేనిపోని అపోహలు రగిల్చేందుకు.. ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ప్రారంభమయ్యాయి. భక్తుల్లో అలజడి రేపడం దీని ప్రధాన ఉద్దేశమంటున్నారు. నిజానికి రమణదీక్షితులు చేస్తున్న ప్రతి ఆరోపణకు..జవాబు ఆయనకు తెలుసు. ఎందుకంటే.. గత ఇరవై ఐదు ఏళ్లుగా ఆయన ఆలయానికి ప్రధాన పూజారి. ఆభరణాలకు సంబంధించి 2010లోనే జస్టిస్ వాధ్వా కమిటీ పరిశీలన జరిపి తిరువభరణం ప్రకారం నగలు ఉన్నాయని తేల్చారు. అప్పుడు తన అభిప్రాయాన్ని కూడా.. రమణదీక్షితులు జస్టిస్ వాధ్వా కమిటీకి చెప్పారు. కానీ ఈ రోపణలు చెప్పలేదు.
ఇంత కాలం శ్రీవారి సేవలో గడిపి.. ఇప్పుడు కొత్తగా రాజకీయం కోసం ఆ శ్రీవారినే కించపరిచే విధంగా రమణదీక్షితులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఒక్కడు లేకపోతే.. ఆలయం బాగుండదన్నట్లుగా మాట్లాడుతున్నారు.కానీ ఆలయానికి ఓ వ్యవస్థ ఉంది. శ్రీవారిని రాముడిలా ఉపయోగించుకునేందుకు రమణీదక్షితుల ద్వారా బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.