భారతీయ జనతా పార్టీ రాజధాని రాజకీయాన్ని అందిపుచ్చుకుంది. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను గుర్తించి.. రాజధానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాజధానిని తరలిస్తే.. భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రశ్నే లేదని.. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తేల్చి చెప్పారు. సుజనాచౌదరి ఇతర నేతలతో కలిసి.. రాజధాని ప్రాంతాల్లో బీజేపీ బృందం పర్యటించింది. రైతులతో మాట్లాడింది. అక్కడి పరిస్థితులను అంచనా వేసింది. ఈ క్రమంలో రాజధానిపై ఏపీ సర్కార్ విధానాన్ని.. బీజేపీ ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని… మండిపడ్డారు. రాజధానిని తరలించాలనే ఆలోచన చేస్తే.. ఊరుకోబోమని హెచ్చరించారు.
రాజధానిపై మంత్రులు చేస్తున్న ఆరోపణలపై.. బీజేపీ నేతలు.. తీవ్రంగా స్పందించారు. ఒకే సామాజికవర్గం భూములు కొంటే… ఆ వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అవినీతి జరిగితే.. తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కానీ… ఊరకనే ఆరోపణలు చేస్తూ.. రాజధానిలో గందరగోళ పరిస్థితులు సృష్టించడమేమిటని ప్రశ్నించారు. బీజేపీ బృందానికి రైతులు.. తమ గోడును వెళ్లబోసుకున్నారు. బీజేపీ నేతలు వారికి ధైర్యం చెప్పారు. రాజధానిని మార్చండ అంత సులభం కాదని.. సుజనా చౌదరి చెప్పారు. అమరావరిలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ అనుమతినే నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.
మొత్తానికి భారతీయ జనతా పార్టీ.. రాజధాని విషయంలో యాక్టివ్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ పై తీవ్ర విమర్శలతో రంగంలోకి దిగింది. నిజానికి ప్రజాభిప్రాయాన్ని.. అంచనా వేయడానికే.. ఏపీ సర్కార్.. బొత్సతో అదే పనిగా.. పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయిస్తున్నారనేది.. చాలా మంది అనుమానిస్తున్న విషయం. రియాక్షన్ తెలుసుకుంటున్న ఏపీ సర్కార్.. ఈ మేరకు.. ఏ నిర్ణయం ప్రకటించబోతోందోనన్న ఆసక్తి అంతటా వ్యక్తమవుతోంది. రాజధాని విషయంలో ఇతరులందర్నీ… విమర్శిస్తున్న వైసీపీ… బీజేపీ జోలికి మాత్రం పోవడం లేదు.