తెలంగాణ బీజేపీకి గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నాయకుడ్ని ఎంపిక చేసుకోలేకపోతున్నారు. ఎన్ని సార్లు సమావేశం జరిగినా తేలడం లేదు. గతంలో అమిత్ షా సమక్షంలో ప్రకటన ఉంటుందనుకున్నారు. కానీ తేలలేదు. తాజాగా మరోసారి హైకమాండ్ కీలక నేతలు వచ్చి సోమవారం సమావేశం పెట్టారు. అక్కడా తేలలేదు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్లు తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు.
బీజేపీలో వరుసగా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలను తానేనని..తనకు చాన్స్ ఇవ్వాలని రాజాసింగ్ డమాండ్ చేస్తున్నారు. కానీ ఆయన వివాదాస్పద వ్యక్తి అని.. చెప్పి కీలక నేతలు పక్కన పెట్టేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మినహా అందరూ కొత్తవారే. అంటే ఈ ఎన్నికల్లో 8 మంది బీజేపీ నుంచి గెలుపొందగా అందులో ఆరుగురు కొత్తవారే.
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన కూడా బీజేపీ ఎల్పీ నేత రేసులో ఉన్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కానీ ఆయన ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు. పార్టీ హైకమాండ్ మాత్రం.. కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలను ఓడించిన వెంకటరమణ రెడ్డికి బీజేఎల్పీ పదవి ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. ఆయననే నియమించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇతర ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారన్నది కీలకం.