పరిపూర్ణానంద స్వామిని ఆర్నెల్లపాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం చెలరేగడం, హిందూ ధర్మ పరిక్షణకు తాను యాత్ర చేస్తానంటూ పరిపూర్ణానంద ముందుకు రావడం, నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా ఆయన్ని బహిష్కరిస్తున్నట్టు పోలీసులు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. అయితే, ఈ అంశంపై భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా స్పందించారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన ఒక లేఖ రాశారు. గూండాలను బహిష్కరించేందుకు ఉన్న చట్టాలను పరిపూర్ణానందపై ప్రయోగించడం దారుణమంటూ ఖండించారు. ఇంతకీ, ఉన్న చట్టాలను పోలీసులు సరిగా అర్థం చేసుకోవడం లేదా అంటూ ప్రశ్నించారు.
పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించిన సమయంలో పోలీసులు ఒక నోటీసును జారీ చేశారు. దీన్లో సెక్షన్ 3 ప్రకారం ఆయన్ని నగరం నుంచి బయటకి పంపిచారని పేర్కొన్నారు. ఇదే అంశాన్ని సుబ్రహ్మణ్య స్వామి ప్రస్థావిస్తూ… ఆ సెక్షన్ ను ప్రయోగించినవారు దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టుగా లేరన్నారు. గూండాలను బహిష్కరించేందుకు మాత్రమే దీన్ని వాడాలనీ, ఈ సెక్షన్ ప్రకారం ఒక వ్యక్తిని బహిష్కరించాలంటే… దానికంటే ముందుగా సదరు వ్యక్తిని గూండా అంటూ ప్రకటించాల్సి ఉంటుందన్నారు. మరి, పరిపూర్ణానంద స్వామిని ఏ రకంగా గూండా అని నిర్ధరణకు వచ్చారు, ఏ విధంగా ప్రకటించారు అంటూ ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు? ఇది స్వామీజీని ఘోరంగా అవమానించినట్టే అవుతుందన్నారు. రాజ్యాంగ ప్రకారం స్వామీజీకి ఉన్న ప్రాథమిక హక్కుల్ని భంగపరచారంటూ వ్యాఖ్యానించారు. కాబట్టి, జారీ చేసిన నోటీసుల్ని మరోసారి పరిశీలించి, రద్దు చేయాలన్నారు. లేదంటే.. తాను న్యాయపరంగా పోరాటానికి సిద్ధమౌతా అంటూ ఆయన స్పష్టం చేశారు.
అయితే, పరిపూర్ణానంద బహిష్కరణను భాజపా అనుబంధ సంస్థలైన ఆర్.ఎస్.ఎస్., భజరంగ్ దళ్ వంటివి మరింత చర్చనీయం చేసేందుకే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. కేవలం మజ్లిస్ మద్దతు కోసమే పరిపూర్ణానందను ముఖ్యమంత్రి కేసీఆర్ బహిష్కరించారనే వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇదే వ్యూహంలో భాగంగానే హైదరాబాద్ తోపాటు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భాజపా, అనుబంధ సంస్థలు ధర్నాలు చేశాయి. ఈ అంశంపై మౌనంగా ఉండొద్దనే సంకేతాలు పై నుంచి ఉన్నట్టు వినిపిస్తోంది! అయితే, ఈ అంశం కోర్టు వరకూ వెళ్లింది కాబట్టి.. తెరాస కూడా తదుపరి కార్యాచరణకు వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా, పరిపూర్ణానంద బహిష్కరణ అంశాన్ని భాజపా అంత ఈజీగా వదిలేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే, పొలిటికల్ గా తద్వారా కొంత మైలేజీ భాజపాకి కనిపిస్తోంది కదా! కాబట్టి, వ్యూహాత్మకంగానే ఈ ఇష్యూని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకునే ప్రయత్నమే కనిపిస్తోంది.