అఫ్జల్ గురు ఉరితీతపై కార్యక్రమం జరిగిందంటూ జెఎన్‌యు విద్యార్థి సంఘ నాయకులపై దేశ ద్రోహ నేరం ఆరోపించి అరెస్టు చేశారు..
కాని జమ్మూ కాశ్మీర్లో ఆ ఉరితీతను తీవ్రంగా ఖండించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి)తో కలసి అధికారం పంచుకోవడం ఇప్పుడు కూడా చర్చలు జరపడం బిజెపిని ఇరకాటంలో పడేసింది. కీర్తిశేషులైన ముఖ్యమంత్రి మఫ్తి మహ్మద్ సయిద్ కూడా అఫ్జల్ గురు అవశేషాలను అప్పగించాలని కోరిన వారిలో ఒకరు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినందుకు పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు చెప్పారాయన!
ఇప్పుడు జెఎన్‌యు కల్లోలం అనంతరం కూడా పిడిపి సీనియర్ నాయకుడు రఫీ అహ్మద్పరా మాట్లాడుతూ తాము ఈ ఉరితీత సరికాదన్న అభిప్రాయానికే కట్టుబడివున్నామని ఆదివారం పునరుద్ఘాటించారు. బిజెపి ప్రభుత్వం ఆయన భౌతిక అవశేషాలను అప్పగించాలని కోరారు. ఆ పార్టీ యువ నాయకుడు కూడా అదే కోరారు. పిడిపి అగ్రనాయకులే బాహాటంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. గతంలో వారితో స్నేహం నెరపడమే గాక మెహబూబా మఫ్తీతో కలసి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తంటాలు పడుతున్న బిజెపి గాని కేంద్ర నాయకులు గాని దేశ ద్రోహులై పోతారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎట్టిపరిస్తితుల్లో ఇలాటి శక్తులను సహించేది లేదంటున్న హౌం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే కాశ్మీర్ పయనం కడతారా అని అడుగుతున్నాయి.