గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్పై సర్జికల్ స్ట్రైక్ చేసేసింది. ఫలితంగా గ్రేటర్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. టీఆర్ఎస్కి మేజిక్ మార్క్‌కి తగ్గట్లుగా సీట్లు లభించలేదు. ఎక్స్ అఫిషియో ఓట్ల దన్నుతోనూ మేయర్ సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పూర్తి స్థాయి మెజార్టీతో మేయర్ పీఠం దక్కించుకోవలాంటే.. మజ్లిస్ పార్టీపై ఆధారపడాల్సి ఉంటుంది. గ్రేటర్లో బీజేపీ ఓట్ల శాతం… టీఆర్ఎస్ తో పోటాపోటీగా వచ్చింది. అవసరమైన చోట కావాల్సినన్నీ ఓట్లు రాకపోవడంతో..చాలా వరకూ.. సీట్లు కోల్పోయారు. అనేక చోట్ల… చాలా స్వల్ప తేడాతోనే సీట్లు కోల్పోయారు.
తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తానేనని బీజేపీ ఈ ఎన్నికల ద్వారా నిరూపించుకుంది. టీఆర్ఎస్ అంటే ఇష్టం లేని వర్గాలన్నీ ఏకమై.. ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బీజేపీకి మద్దతిచ్చాయి. వరదలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెంచాయి. వరద ప్రభావిత ప్రాంతాలు అన్ని చోట్లా టీఆర్ఎస్ పరాజయం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకపక్షంగా బీజేపీకి పడింది. ఫలితంగా టీఆర్ఎస్తో పోటీగా బీజేపీ సీట్లు దక్కించుకుంది. మజ్లిస్‌కు పాతబస్తీలో ఎదురు లేదని మరోసారి నిరూపితమయింది. బీజేపీతో పోరు ఆ పార్టీకి కలసి వస్తోంది. ఓట్ల పోలరైజేషన్‌కు ఉపయోగపడుతోంది. అధికారంలో ఉన్న పార్టీతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ.. హిందూ ఓట్లు చీలేలా.. అభ్యర్థుల్ని నిలబెట్టే వ్యూహంతో మొదటి నుంచి మంచి ఫలితాలు సాధిస్తున్న ఎంఐఎం.. ఈ సారి కూడా.. అదే వ్యూహంతో ముందడుగు వేసింది. దాదాపుగా సిట్టింగ్ సీట్లన్నింటినీ నిలబెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితే అత్యంత దారుణంగా ఉంది. గత గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్లు రెండే గెల్చుకున్నప్పటికీ.. టీఆర్ఎస్తో ప్రధాన ప్రత్యర్థిగా పోటీ పడింది. కానీ ఈ సారి కూడా రెండే కార్పొరేటర్ సీట్లకు పరిమితం అయింది.. కానీ ఓట్ షేర్ మాత్రం దారుణంగా పడిపోయింది. టీఆర్ఎస్, బీజేపీలతో పోటీ పడలేకపోయింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
గ్రేటర్లో బాధ్యతలు తీసుకున్న టీఆర్ఎస్ ముఖ్య నేతలకు షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్చార్జ్గా ఉన్న గాంధీనగర్‌లో టీఆర్ఎస్ ఓడిపోయింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇన్చార్జ్గా ఉన్న అడిక్‌మెట్‌లో.. మంత్రి సబిత ఇన్చార్జ్గా ఉన్న ఆర్కే పురంలో టీఆర్ఎస్ పరాజయం పాయింది. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి భార్య బేతి స్వప్న , ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు కూడా ఓడిపోయారు. మాజీ మంత్రి నాయిని అల్లుడు కూడా పరాజయం పాలయ్యారు. గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారాయి. భారతీయ జనతా పార్టీకి గొప్ప విజయంగా కనిపిస్తున్నాయి. మేయర్ సీటు టీఆర్ఎస్కు దక్కవచ్చు కానీ… ఆ పార్టీకి ఆదరణ రాను రాను తగ్గిపోతోందన్న విషయం మాత్రం.. ఫలితాలతో స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ గెల్చినా సంతోషం లేకుండా పోయింది. బీజేపీ ఓడినా గెల్చినంతగా సంబర పడిపోతోంది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలు భవిష్యత్ రాజకీయ పయనానికి ఓ సూచికలా కనిపిస్తున్నాయి.