మహాత్ముడిని చంపిన నాధూరామ్ గాడ్సేను.. నిజమైన దేశభక్తుడిగా కొలిచే.. బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు భారతీయ జనతా పార్టీ షాకిచ్చింది. లోక్‌సభలో జరిగిన ఓ చర్చలో.. గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ.. ప్రసంగించి.. ప్రజ్ఞాసింగ్ … విమర్శల పాలయింది. ఆమెను వెనుకేసుకొస్తున్న బీజేపీది కూడా అదే విధానమా.. అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆ పార్టీ ఎంపీపై చర్యలు తీసుకోక తప్పలేదు. ఆమెను రక్షణశాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి కూడా ప్రజ్ఞాను బహిష్కరించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఈ మేరకు.. క్రమశిక్షణా కమిటీ సమావేశం తర్వాత బీజేపీ ప్రకటన చేయనుంది.
ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆమె మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలుగా ఉన్నారు. అయినప్పటికీ..బీ జేపీ టిక్కెట్ ఇచ్చి.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్.. పోటీ కి పెట్టారు. ఆ ఎన్నికల ప్రచారంలోనే… గాంధీని చంపిన గాడ్సే.. నిజమైన దేశభక్తుడని ప్రకటించి సంచలనం రేపారు. అప్పుడే.. తీవ్ర వివాదాస్పదం అయింది. చర్యలు తీసుకుంటామని… మోడీ సహా.. బీజేపీ పెద్దలు ప్రకటించారు కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో.. ఇప్పుడు.. ఆమె .. నేరుగా లోక్‌సభలోనే వ్యాఖ్యలు చేసింది. ఇదంతా బీజేపీ అగ్రనాయకత్వం ప్రోద్భలంతోనే జరుగుతోందన్న భావన ప్రజల్లోకి వచ్చే ప్రమాదం ఉండటంతో.. ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
నిజానికి ఆరెస్సెస్ భావజాలంలో.. గాంధీని పెద్దగా గౌరవించరని.. దేశ విభజనకు.. గాంధీ కారణమన్నట్లుగా.. ఆరెస్సెస్ నేతలు చెబుతారన్న ప్రచారం ఉంది. ఆ నేపధ్యం నుంచి వచ్చిన వారు.. మహాత్ముడ్ని పెద్దగా గౌరవించరు. గుజరాత్లో వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని భారీగా పెట్టారు కానీ.. మహాత్ముడికి మాత్రం.. అంత గుర్తింపు లభించలేదు. ఒక్క సాధ్వీనే కాదు.. పలుమార్లు.. పలువురు ఆరెస్సెస్ వాదులు.. మహాత్ముడ్ని విమర్శించారు. ఇక వాటిని సహించబోమని.. బీజేపీ అగ్రనాయకత్వం ప్రజ్ఞాసింగ్ పై.. వేటుతో సందేశం పంపినట్లయింది.