2014లో గుజరాత్ మోడల్ అభివృద్ధి పేరుతో… మోడీని .. బాహుబలిలా చూపించి ప్రచారం చేసుకున్నారు. విజయం సాధించారు. ఇప్పుడు కూడా గుజరాత్ మోడల్‌నే అమలు చేస్తున్నారు. కాకపోతే అభివృద్ధి కాదు.. మత విద్వేష ఎజెండా. విపక్షాలు మోడీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతుంటే… ప్రధాని మాత్రం ఒక్క మతం అంశానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐదేళ్లు అభివృద్ధి నినాదం వినిపించిన బీజేపీ.. ఎన్నికల్లో మాత్రం అభివృద్ధి అనే మాటను పక్కనపెట్టింది. ఈ ఐదేళ్లలో ఏం చేశామన్న దానికంటే.. ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది బీజేపీ. ముఖ్యంగా ప్రధాని నుంచి ఇతర అగ్రనేతలంతా..మతాన్ని హైలెట్ చేస్తున్నారు.
ప్రధాని స్థానంలో ఉండి.. దేశంలోని ప్రజలందర్నీ సమానంగా చూడాల్సిన ప్రధాని మోడీ… ముస్లిలను తక్కువ చేసి మాట్లాడటం ప్రారంభించారు. వర్గాల మధ్య చీలికలు తీసుకొచ్చేలా ప్రసంగిస్తున్నారు. మహారాష్ట్రలోని వార్దా ప్రచార సభలో ప్రధానిమోదీ వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. రాహుల్ గాంధీ మెజార్టీలు ఉండే స్థానం పోటీకి భయపడి.. మెజార్టీలు మైనార్టీలుగా ఉండే నియోజకవర్గం వయనాడ్ ఆశ్రయం పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇది వివాదాస్పదంగా మారాయి. వయనాడ్‌లో ముస్లింలు, క్రిస్టియన్లు సాధారణం కంటే ఎక్కువగా ఉంటారని.. అందుకే రాహుల్ అక్కడికి వెళ్తున్నారంటూ బీజేపీ నుంచి దాడి మొదలైంది. మోదీ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావడం దేశం మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. వర్గాల మధ్య చీలికలు తీసుకొచ్చేలా ప్రధాని వ్యాఖ్యనించడాన్ని ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మోదీ మాత్రమే కాదు.. బీజేపీ అగ్రనేతలు కూడా ఇదే కోణంలోనే వెళ్తున్నారు. అది వారి విధానంలా మారింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. సైతం ఇలాంటి ప్రచారంతోనే ముందుకు సాగుతున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. మతం ఆధారంగా పౌరసత్వ చట్టంలో ఉన్న క్లాజులను మారుస్తామని చెప్పారు అమిత్ షా. ఆ చట్టాన్ని హిందువులు, బౌద్దులు, సిక్కులకు అనుకూలంగా మారుస్తామని ప్రకటించారు. అభివృద్ధి అంటూ ఊదరగొట్టిన బీజేపీ ఇపుడు ఎందుకు పాలన గురించి చెప్పుకోవడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అరుణ్‌జైట్లీ.. కశ్మీర్ అంశాన్ని రాజకీయం చేసే బాధ్యత తీసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక హోదాను తొలగించాలని జైట్లీ వ్యాఖ్యానించారు. దాని వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదన్నారు. దీనిపై కశ్మీర్ నేతలు భగ్గుమన్నారు. ఆ నిర్ణయం వల్ల కశ్మీర్, కేంద్రం మధ్య సంబంధాలు దెబ్బతింటాయని అన్నారు ముఫ్తీ. ఇదే కాదు… ఆర్టికల్ 370 రద్దు చేస్తే.. కశ్మీర్‌కి ప్రత్యేక ప్రధాని, ప్రత్యేక రాష్ట్రపతి ఏర్పాటు చేసుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఒమర్ అబ్దుల్లా. ఇలా బీజేపీ నేతలు విద్వేషాలను పెంచేలా చేస్తోన్న వ్యాఖ్యలు… దేశంలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. దాంతో ప్రచారం మొత్తం వాటి చుట్టే తిరుగుతోంది. ఐదేళ్లు ఏం చేశారని చెప్పుకునే దానికంటే ఇపుడు… ఈ ప్రచారానికే మొగ్గు చూపుతున్నారు బీజేపీ నేతలు.