రామతీర్థం ఘటనపై రాజకీయ పేలాలు ఎరుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుపతి ఉపఎన్నికలో జరుగుతున్న పోటీ.. ఏసు ప్రభువు, శ్రీకృష్ణుని మధ్య అని… ఘనత వహించిన బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ ధియోధర్ శుక్రవారం శ్రీకాళహస్తిలో వాక్రుచ్చారు. తాను మాత్రం ఏం తక్కువ కాదని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రంగంలోకి దిగారు. తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ భగవద్గీతకు.. బైబిల్‌కు అంటూ ప్రకటన చేసేశారు. అంతే కాదు.. అక్కడ బీజేపీ, జనసేన తరపున ఎవరు పోటీ చేసినా.. ఎదురుగా నిలబడేది మోడీ మాత్రమేనని సెంటిమెంట్ కూడా ప్రయోగిస్తున్నారు. బీజేపీ నేతల ప్రకటనలు చూసి.. సామాన్యులు కూడా విస్తుపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మతాల చిచ్చును రాజకీయంగా వాడుకోవడంలో.. బీజేపీ ఎంతకైనా దిగజారిపోతుందని… సునీల్ ధియోధర్, బండి సంజయ్ ప్రకటనతో తేలిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు రామతీర్థం ఆలయంలో జరిగినదానికి.. రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా..? అసలు బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా..? అసలు ఏసు ప్రభువుకి.. కృష్ణుడికి ఏమైనా సంబంధం ఉందా..? బైబిల్, భగవద్గీత పోలిక ఎందుకు..? అయినా బీజేపీ నేతలు లింక్ పెట్టేశారు. ప్రజల్ని రెచ్చగొట్టి.. వారి మధ్య… విభజన రేఖ గీసి.. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బేహారుల్లా తయారై వచ్చేశారు. దేశం మొత్తం ముస్లింలను బూచిగా చూపే… బీజేపీ.. ఏపీలో మాత్రం.. క్రైస్తవాన్ని చూపించడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవాన్ని ఆచరిస్తాడు కాబట్టి.. దాన్ని టార్గెట్ చేసి.. అందర్నీ ఆయనకు వ్యతిరేకంగా తమ వైపు తిప్పుకోవాలనే ప్లాన్ అమలు చేస్తున్నారు.
బీజేపీ రాజకీయాల వల్ల ప్రజల్లో విభజన వచ్చి.. అశాంతి చెలరేగుతుంది తప్ప.. దేశానికి .. రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ ఉండదు. కానీ.. బీజేపీ అలాంటి వాటిని పట్టించుకోదు. తమ రాజకీయప్రయోజనాలే తమకు ముఖ్యం. ప్రజలు కొట్టుకు చచ్చని వారికి పట్టింపు ఉండదు. అయితే ఏపీ ప్రజలు వారి ట్రాప్‌లో పడతారా.. లేక… తమను మతాల విషయంలో ఎవరూ రెచ్చగొట్టలేరని నిరూపిస్తారో వేచి చూడాల్సిందే. బీజేపీకి పోయేదేమీ ఉండదు. ఎందుకంటే.. ఇక్కడ బీజేపీకి ఏమీలేదు. ఎవరైనా ఆవేశ పడితే.. అదే వారికి బోనస్. ఎన్ని పేలాలు దొరికితే.. బీజేపీకి అంత మజా..!