ఆర్టీసీ సమ్మె విషయంలో.. కార్మికులకు మద్దతుగా బీజేపీ లీడ్ తీసుకుంటోంది. తామున్నామని భరోసా ఇస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత వరకైనా పోరాడతామని ప్రకటించింది. గవర్నర్ ను కూడా కలిసి ఫిర్యాదు చేయడంతో.. రాజకీయం మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ.. ఉద్యోగుల్లో అంతంతమాత్రంగానే ఉన్న మద్దతును.. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండి.. పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో… ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ.. బీజేపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలను… గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు. తమ వాదన వినిపించే అవకాశం కల్పించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. బీజేపీ మద్దతు ఆర్టీసీ కార్మికులకు ధైర్యాన్నిస్తోంది. కేసీఆర్ పై… బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. కేసీఆర్ అగ్గితో తలగోక్కున్నారు .. ఈ ప్రభుత్వానికి త్వరలో ఒళ్లు కాలుతుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో రాజకీయంగా బలపడాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ.. తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో చేరికలతో… బలోపేతమయ్యామని ఆ పార్టీ నేతలు అంచనాతో ఉన్నారు. ఇప్పుడు… వివిధ వర్గాల్లో పట్టు పెంచుకోవడమే కీలకమని… ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికి ఆర్టీసీ సమ్మె బాగా ఉపయోగపడుతోంది. కేసీఆర్ పై… తీవ్ర స్థాయిలో పోరాటం చేయడం ద్వారా తామే ప్రత్యామ్నాయమని నిరూపించాలనుకుంటున్నారు.
బీజేపీ నేతలు ఆర్టీసీ సమ్మె విషయాన్ని గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు. కేంద్రం వద్దకూ తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఆర్టీసీలో కేంద్రానికి కొంత వాటా ఉంటుంది. కేసీఆర్ దూకుడుని తగ్గించి.. ఆర్టీసీ కార్మికులకు మేలు చేస్తే.. రాజకీయంగా ఉపయోగమని బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. అదే జరిగితే.. కేసీఆర్ పై చేయి సాధించినట్లవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే.. ముందు ముందు…. ఆర్టీసీ సమ్మె విషయంలో … టీఆర్ఎస్ సర్కార్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.