బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా తాము బీజేపీలో చేరామని కానీ ఆ పార్టీ ఆశయాలకు తగ్గట్లుగా లేదని తాము తమ దారి తాము చూసుకుంటున్నామని చెప్పేందుకు బీజేపీలోని ఓ పది మంది నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో విజయశాంతి కూడా ఉన్నారు. ఆమె సోషల్ మీడియా ద్వారా నేరుగానే చెబుతున్నారు. బీజేపీ రాజకీయ ఆత్మహత్య చేసుకుందని… బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. అయితే విజయశాంతిని బీజేపీలో ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు.
ఓ పది మంది నేతలు గత కొద్ది రోజులుగా సీక్రెట్ భేటీలు నిర్వహించి మీడియాకు లీకులు ఇస్తున్నారు. బీఆర్ఎస్కు పరోక్షంగా సహకరించేందుకు బీజేపీ రాజకీయాలు చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పార్టీలో చేరిందే బీఆర్ఎస్ ను ఓడించడానికని… పార్టీలో చేరేటప్పుడు బీఆర్ఎస్తో ఎలాంటి నేరుగా.. లోపాయికారీ ఒప్పందాలు ఉండవని చెప్పారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తూంటే పూర్తిగా బీఆర్ఎస్కు లొంగిపోయినట్లుగా ఉందని ఉంటున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి సహా అందరూ. .. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని .. బీఆర్ఎస్ ఓడించే పార్టీ బీజేపీ అనే వాదనతో పోలోమని బీజేపీలో చేరిపోయారు. మొదట్లో వారికి కూడా అలాగే అనిపించింది. కానీ రాజకీయం అంటేనే రోలర్ కోస్టర్ రైడ్. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేరు. ఈ వాదనతో బీజేపీ లో చేరిన వారంతా ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ అన్నా కేసీఆర్ అన్నా తీవ్రంగా విరుచుకుపడేవారే. అయితే వీరందరికి కాంగ్రెస్ లో చోటు ఉంటుందా అన్నదే ఇప్పుడు కీలకం.