కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది భారతీయ జనతా పార్టీ నినాదం. కానీ.. అసలు ఆ పార్టీ మొదటగా ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ.. ఇదే వ్యూహం అమలు చేస్తోంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పుల్ జోష్ మీద ఉంది. జాతీయ స్థాయిలో రెండో సారి దక్కిన తిరుగులేని విజయంతో.. తమకు ప్రాబల్యం లేని రాష్ట్రాల్లో అడుగు పెట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకే.. ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీఎస్, టీఆర్ఎస్, టీడీపీ సహా.. ఇతర పార్టీలపై గురి పెట్టింది.
ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలహీనం..!
నరేంద్రమోడీ, అమిత్ షా వ్యూహాలు అమలవుతున్న తీరును బట్టి చూస్తే.. వారి గోల్ సాధించడానికి ఎంతో కాలం పట్టదన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి..తీవ్రంగా ఉందని అంచనా వేయకతప్పదు. మోదీ, అమిత్ షా వ్యూహాలు.. వారికి ఉన్న అధికార పార్టీ అనే హోదా ను తట్టుకోగలిగే స్థితిలో ప్రాంతీయ పార్టీలు లేవనే అభిప్రాయం ఏర్పడుతోంది. ప్రాంతీయ పార్టీలకు ఉండే బలం నాయకత్వమే. ఇప్పుడు ఆ నాయకత్వాన్నే బీజేపీ బలహీనం చేస్తోంది. ఒక్క సారి నాయకత్వం అంటూ బలహీనపడితే.. ప్రాంతీయ పార్టీలు మళ్లీ కోలుకునే పరిస్థితి ఉండదు. బీజేపీ మొదటి నుంచి ఇదే వ్యూహం అమలు చేస్తంది.
సవాల్ చేసిన నేతలంతా ఇప్పుడు జీహూజూర్ అనాల్సిన పరిస్థితి..!
దేశ రాజధాని ఢిల్లీలో 2015 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో.. 70 స్థానాలున్న అసెంబ్లీలోఏకంగా 67 చోట్ల ఆమ్ ఆద్మీ గెలిచింది. కానీ ఐదేళ్లు తిరిగే సరికి పరిస్థితి మారిపోయింది. నిన్నామొన్నటి వరకూ.. బీజేపీని తీవ్రంగా విమర్శించిన కేజ్రీవాల్ ఇప్పుడు సైలెంటవుతున్నారు. పైగా కుదిరినప్పుడు కాసిన్ని క్షమాపణలు..అవసరమైనప్పుడు కొన్ని పొగడ్తలు మోదీపై కురిపిస్తున్నారు. ఇదంతా.. ఆయన పార్టీని కాపాడుకోవడానికే. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ … ఉనికి కోల్పోకుండా ఉండటానికే…! ..సామాన్యుడిగా పార్టీ ప్రారంభించి… బీజేపీనే సవాల్ చేసిన స్థాయికి ఎదిగిన కేజ్రీవాల్ ఇప్పుడు .. పార్టీ ఉనికి కోసం.. తనకు మాలిన రాజకీయం చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీది మాత్రమే కాదు… దేశంలో ఉన్న ప్రముఖ ప్రాంతీయ పార్టీలన్నింటిది.
చివరికి అన్ని పార్టీలదీ.. “అస్సాం” గణపరిషత్ పరిస్థితే..!
కర్ణాటకలో.. జేడీఎస్ పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా ఉంది. లక్ బై చాన్స్ .. కాంగ్రెస్ మద్దతుతో ఆ పార్టీ నేత కుమారస్వామి సీఎం అయినప్పటికీ.. బీజేపీ రాజకీయం ముందు నిలబడే అవకాశం కనిపించడం లేదు. అదే సమయంలో.. జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితి ఇప్పటికే… అటూఇటుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో… తాజాగా అధికారం కోల్పోయిన టీడీపీని ఇప్పటికే.. బీజేపీ పెద్దలు గురి పెట్టారు. భారీ ఎత్తున వలసల్ని ప్రొత్సహిస్తున్నారు. టీడీపీ ఖాళీ అయిపోతుందని.. ఇక మిగిలేది.. బీజేపీనేనని చెప్పడం ఇప్పటికే ప్రారంభించారు. తెలంగాణలోనూ… అదే జోష్ కొనసాగిస్తున్నారు. నిన్నామొన్నటి వరకూ.. వారి దృష్టి టీఆర్ఎస్ పై పెద్దగా లేదు. కానీ ఇప్పుడు.. వ్యూహం మార్చారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయశక్తి తామేనని చెబుతున్నారు. ఈ అన్నీ పార్టీల భవిష్యత్ ఎలా ఉంటుందంటే… దానికి సాక్ష్యం.. దీనికి అసోంలో.. అస్సాం గణపరిషత్ పార్టీనే చూపిస్తున్నారు బీజేపీ నేతలు. అదే క్లైమాక్స్ కావొచ్చు కూడా..!