పోలవరంపై ఏపీ ప్రభుత్వ వైఖరిని.. తమకు కలిసొచ్చేలా చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీకి స్క్రీన్ ప్లే రెడీ చేసుకుంది. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం… పోలవరం ప్రాజెక్ట్ అధారిటీతో పాటు.. కేంద్ర జలశక్తి సంస్థను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో.. షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాలన్న నిర్ణయం ఇప్పటికే ఉన్నత స్థాయిలో జరిగిందని చెబుతున్నారు. అదే సమయంలో ఏపీ బీజేపీ నేతల నుంచి పలు కీలక ప్రతిపాదనలు… ఆ పార్టీ అగ్రనాయకత్వానికి వెళ్లాయని చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ లో ఇప్పటికే 71 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రతీ రూపాయి కేంద్రమే ఖర్చు చేస్తోంది. ప్రాజెక్ట్ మిగతా పనులను కేంద్ర ప్రభుత్వమే చేపట్టి ప్రాజెక్ట్ ను పూర్తిచేస్తే ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని బీజేపీ భావిస్తోంది. పోలవరం క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రమే మొత్తం నిధులు ఇస్తున్నా.. జగన్ వైఖరితో… కేంద్రంపై అనుమానాలు ప్రారంభమయ్యేలా ఉన్నాయని.. పోలవరం ప్రాజెక్టు వైఎస్ పేరు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపట్ల బీజేపీ చిత్తశుద్ధితో ఉందనే సంకేతాన్ని ఏపీ ప్రజలకు పంపాలని రాష్ట్ర బీజేపీ నేతలు హైకమాండ్ కు నివేదిక పంపినట్లుగా తెలుస్తోంది.
కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టే.. పీఎంవో కార్యాలయం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుందని కూడా బీజేపీ నేతలంటున్నారు. ఇదే అదునుగా భావిస్తోన్న బీజేపీ ఇక రాష్ట్రంలో వేగం పెంచాలని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నే ఇందుకు అవకాశంగా మలచుకోవాలని భావిస్తోంది. కాంట్రాక్ట్ సంస్థనే తిరిగి కొనసాగించి పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసే విధంగా కేంద్రం తెరవెనుక పావులు కదుపుతోంది. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రంలో చేతిలోకెళ్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మైనస్‌గా మారనుంది.