తెలంగాణలో నాలుగు ఎంపీలు భాజపా గెలుచుకున్న సంగతి తెలిసిందే. దాంతో రాష్ట్రంలో పార్టీ విస్తరణకు కావాల్సిన పునాదులు బలంగా పడ్డాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక భాజపా తరువాతి లక్ష్యం తెలంగాణ అని ఆ పార్టీ నేతలు కూడా గట్టిగానే చెప్పారు. కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత, హైదరాబాద్ వచ్చిన భాజపా ఎంపీ కిషన్ రెడ్డి కూడా ఇప్పుడు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో భాజపా తరువాతి లక్ష్యం తెలంగాణ అని ఆయనా అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా త్వరలో తమ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఉన్న మార్గాలన్నింటినీ తాము అన్వేషించి ముందుకు సాగుతామన్నారు.
కాంగ్రెస్ బలహీనపడుతున్న చోట్లలో తాము ఎంపీలుగా గెలిచామనడం సరికాదనీ, భాజపా బలోపేతం అవుతోంది కాబట్టే రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కి దక్కకుండా పోయాయన్నారు కిషన్ రెడ్డి. తాము బలంగా లేని ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ లక్కీగా గెలిచిందన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచి వెళ్లిపోతుంటే, కాంగ్రెస్ పార్టీ భాజపాని విమర్శిస్తూ కూర్చోవడం బుద్ధిలేనితనం అన్నారు. దేశంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి వచ్చిందనీ, పార్టీని నడిపే శక్తి సామర్థ్యాలు తనకు లేవని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారన్నారు. అలాంటిది, తమకు విమర్శించే నైతిక అర్హత ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. తెలంగాణలో భాజపా అనుసరించాల్సిన వ్యూహంపై త్వరలోనే రాష్ట్ర నాయకులతో చర్చించి వ్యూహరచన చేసుకుంటామని కిషన్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ బలహీనతను తమ బలంగా మార్చుకోవడానికి భాజపా సిద్ధపడుతోందని కిషన్ రెడ్డి మాటల్లో అర్థమౌతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితిని తెలంగాణలో కరెక్ట్ గా వాడుకోవాలని భాజపా భావిస్తోంది. అందుకే, వారి మొదటి లక్ష్యం తెలంగాణలో పార్టీ విస్తరణ అని నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారు. వాస్తవానికి, గడచిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలోపేతంగా ఉన్నట్టుగా కనిపించినా… అసెంబ్లీలో ఎల్పీ విలీనం, జెడ్పీ ఎన్నికల్లో తెరాస విజయం, ఈ రెండూ కాంగ్రెస్ ఆత్మ విశ్వాసాన్ని తగ్గించేశాయి. పైగా, హైకమాండ్ నుంచి కూడా తెలంగాణలో పార్టీ దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించే పరిస్థితులు కనిపించడం లేదు! ఇవన్నీ ప్లస్ గా మార్చుకునే ఉద్దేశంలో భాజపా ఉంది.