తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఓ పద్దతి ప్రకారం.. టీఆర్ఎస్ పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. ఈ ఆకర్ష్ ఫార్ములా అంతా.. 2014లో టీఆర్ఎస్ అధినేత పాటించినదే. అప్పట్లో టీడీపీని లేకుండా చేయడానికి టీడీపీ ముఖ్య నేతలందర్నీ పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే ఫాలో అవుతోంది. అయితే టీఆర్ఎస్ అధికార పార్టీ కాబట్టి.. ముందుగా అసంతృప్తి వాదుల్ని గురి పెట్టింది. తాము బలహీనంగా ఉన్న చోట్ల.. టీఆర్ఎస్లో ప్రాధాన్యత దక్కని నేతలపై దృష్టి పెట్టింది. ఆ జాబితాలో ఖమ్మం జిల్లాలో కీలక నేతలుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులపై బీజేపీ నేతల దృష్టి పడింది.
ప్రత్యేకమైన దూతల్ని పంపి వారితో చర్చలు కూడా జరిపారు. ఈ విషయం బయటకు తెలియడంతో టీఆర్ఎస్లో హైరానా ప్రారంభమయింది. వారిద్దరూ కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. తుమ్మల చాలా సార్లు తన అసంతృప్తిని నేరుగానే బయటకు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం కాకుండా పాలేరులో పోటీ చేయించినా తుమ్మల సైలెంట్ గా ఉన్నారు. ఎంపీ సీటిస్తారేమో అనుకున్నా కేసీఆర్ పట్టించుకోలేదు. పొంగులేటి పరిస్థితి కూడా అంతే. ఎన్నికలకు ముందు ఆయన పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో ఆయనకు కూడా టిక్కెట్ ఇవ్వలేదు.
టీడీపీ నుంచి వచ్చిన నామాకు టిక్కెట్ ఇచ్చారు. దీంతో వారిద్దరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు వారిద్దర్నీ బీజేపీ ఆకర్షిస్తే.. టీఆర్ఎస్గు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే.. తుమ్మలకు హైకమాండ్ పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఈ ఆకర్ష్ జోరు ఇలా కొనసాగిస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే టీఆర్ఎస్ విరుగుడు చర్యలు ప్రారంభించింది.