పార్లమెంటు మట్టి, యమునానది నీటితో అమరావతి సెంటిమెంటుని పటిష్టం చేయడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఖరి తెలుగుదేశం – బిజెపి పార్టీల సంబంధాల్లో మార్పు తెస్తుందా?? ‘అవును’ అన్న వాతావరణమే వ్యాపిస్తున్నట్టు వుంది.
2014 సాధారణ ఎన్నికల్లో భావసారూప్యత కంటే రాజకీయ అనివార్యతే తెలుగుదేశం, బిజెపిల మధ్య మైత్రీ బంధాన్ని వేసింది. బిజెపి కూడా ఊహించనంత విజయం బిజెపికి సమకూరడంతో ఆపార్టీకి మిత్రపక్షాల మద్ధతు లాంఛనప్రాయంగా మాత్రమే మిగిలింది. రాష్ట్రమంత్రి వర్గంలో ఇద్దరు బిజెపి మంత్రులు, అలాగే కేంద్రమంత్రి వర్గంలో తెలుగు దేశం మంత్రులు అధికారరీత్యా బాధ్యతలు నిర్వహించడమే తప్ప పార్టీ స్ధాయిలో రెండు పార్టీలూ కలిసి పనిచేసిన సందర్భం ఒక్కటికూడా లేదు. సంకీర్ణరాజకీయాల్లో దేశ ప్రధానుల్నే ఎంపిక చేసిన అనుభవజ్జుడైన చంద్రబాబు నాయుడు కి ఎన్ డి ఎ లో ఏవిధమైన పాత్రా ప్రమేయమూ లేకుండా పోయాయి. బిజెపికి సమాంతరంగా ఎదిగి పార్టీని సంపూర్ణ ఆధిక్యతో గెలిపించిన నరేంద్రమోదీ మరొకరి మద్దతు అవసరంలేనంత వున్నతంగా వుండటమే ఇందుకు మూలం.
ఎన్నికలకు ముందు తెలుగుదేశంతో పొత్తు అవసరమని భావించిన బిజెపి నాయకులు ఇపుడు తమ పార్టీ నిలదొక్కుకోడానికి తెలుగుదేశం నాయకులు ఏస్ధాయిలోనూ కలసి రావడం లేదని ఫిర్యాదు చేస్తూవుంటారు. రెండు పార్టీలూ ఉమ్మడిగా ప్రజల్లో చేపట్టిన కార్యక్రమం ఒక్కటికూడా లేదు. పెద్దపార్టీగా తెలుగుదేశమే ఇందుకు బాధ్యత వహించవలసి వుంటుంది. తెలుగుదేశంతో కలసి వున్నంతవరకూ సొంతంగా ఎదగలేమని భావించే బిజెపి కార్యకర్తలు, నాయకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల వరకూ వేచిచూడకుండా స్వతంత్ర ఎదుగుదల వెంటనే మొదలు పెట్టాలన్నది వీరి భావన. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్వరం వీరి భావనల్ని తరచు పలికిస్తూ వుంటుంది. సామాజిక వర్గాల కోణంలో బాబు, వెంకయ్య- నాయుళ్ళ మైత్రీ బంధం ఎపిలో బిజెపి విస్తరణకు ప్రతిబంధకమేనన్న వాదన కూడా పార్టీ శ్రేణుల్లో విస్తరిస్తోంది.
విభజన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని జనాలకి చెప్పి, చంద్రబాబు నాయుడి మనవడికి టివిల ముందు కితకితలు పెట్టి వెళ్ళిపోయిన మోదీ వైఖరి తెలుగుదేశం వర్గాల్లో తీవ్రఅసంతృప్తికి దారితీసింది. మిత్రధర్మానికి, ప్రభుత్వాల్లో కొనసాగుతున్న అధికారబాధ్యతకు కట్టుబడి తెలుగుదేశం వారెవరూ బహిరంగ విమర్శ చేయకపోయినా ”తెగతెంపులే మేలు” అన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే ఇది ఇప్పటికిప్పుడే జరిగే పని మాత్రం కాదు. పార్టీ స్ధాయిలో, క్షేత్రస్ధాయిలో ఇప్పటికే అంతంత మాత్రంగా వున్న తెలుగుదేశం, బిజెపి సంబంధాలు భవిష్యత్తులో మరీ పొడిబారిపోయే పరిస్ధితికి కూడా నరేంద్రమోదీ శంకుస్ధాపన చేశారా అనిపించకమానదు.
నిరాశకలిగించిన మోదీ పర్యటనపై విమర్శించేవారిని, ప్రత్యేక హోదా డిమాండ్ చేసేవారిని అభివృద్ధి నిరోధకులు అని బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు వ్యాఖ్యానించడం ఆ పార్టీ నిస్పృహను సూచిస్తోంది. ఇదంతా మీడియా సృష్టి అని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించడం వాస్తవాన్ని దాటవేసే ధోరణిని సూచిస్తోంది. హోదా ఇవ్వని బిజెపితో ఎందుకు తెగతెంపులు చేసుకోరు అన్న ప్రశ్న తెలుగుదేశంలో నిరర్ధక రోషాని రేకెత్తిస్తుంది. ఇలాంటి సంబంధాలు కలకాలం నిలబడవు. ఏమైనా తెగతెంపుల సూచన తెలుగుదేశంలో కంటే బిజెపిలోనే ఎక్కువగా కనిపిస్తోంది.