యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఎలా అధికారాన్ని నిలబెట్టుకున్నారో అదే ఫార్ములాతో తెలంగాణలో అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ మొదట వీధి సమావేశాలు.. తర్వాత నియోజకవర్గ, జిల్లాస్థాయి సమావేశాలు.. తర్వాత భారీ బహిరంగసభలు నిర్వహించారు. తెలంగాణలోనూ అదే చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా వీధి సమావేశాలు ప్రారంభించారు. ప్రజాగోస -బీజేపీ భరోసా యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది బీజేపీ. భరోసా కార్యక్రమంలో 11వేల గ్రామాల్లో సభలు నిర్వహించనుంది.
బీజేపీ భరోసా యాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ విజయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కార్యక్రమంలో గ్రామీణ యువత ఎక్కువగా పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది. కేసీఆర్ సర్కారుపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలను గ్రామ సభలతో తమవైపు తిప్పుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల తర్వాత అగ్రనేతలతో రెండోదశలో మండలం యూనిట్‌గా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట బైక్‌ర్యాలీలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక, మూడోదశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు ఏర్పాటుచేస్తారు. 15 రోజుల్లో వీటిని పూర్తిచేసి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తారు.
ఆ తర్వాత అగ్రనేతలతో భారీ బహిరంగసభలు నిర్వహించడానికి బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోగానే నాలుగైదు బహిరంగ సభలకు ప్రధాని మోదీ హాజరయ్యేలా బీజేపీ ప్రణాళిక రూపొందిస్తోంది. బీజేపీ… యూపీ ఎన్నికల ఫార్మాట్‌ను పూర్తిగా తెలంగాణలో అమలు చేస్తోంది. కాకపోతే అక్కడ అధికారంలో ఉండి.. రెండో సారి అధికారం కోసం ఈ ఫార్ములా అము చేసింది. ఇక్కడ మాత్రం మొదటి సారి అమలు చేస్తోంది.