బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు.. సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నం అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ సంప్రదాయ రాజకీయ పార్టీల కంటే ఘోరం అయిపోయింది. క్రమశిక్షణ అనేది మచ్చకు కనిపించడం లేదు. అసలు ఇప్పటి వరకూ కొట్టుకుంటూ వచ్చిన గాలి మొత్తం పోతున్నట్లుగా కనిపిస్తూంటే…. మిగతా పని నేతలు పూర్తి చేస్తున్నారు.
బండి సంజయ్ ను టార్గెట్ చేస్తున్న అసంతృప్తి వాదులు
తెలంగాణ బీజేపీ కాస్త పుంజుకున్నది బండి సంజయ్ తెలంగాణ శాఖకు అధ్యక్షుడు అయిన తర్వాతే . అయితే ఆయన చేసిందేమిటని.. తమ వల్ల ఈ విజయాలు దక్కాయని.. బీజేపీకి క్రేజ్ వచ్చిందని.. ఆయనేం చేశారని ప్రశ్నించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దుబ్బాకలో కమలం గుర్తు వల్ల కాదని ప్రజలు తనను చూసి గెలిపించారని రఘునందన్ రావు అంటున్నారు. బండి సంజయ్ భారీ ఎత్తున అవినీతి చేశారని కూడా ఆరోపించారు. తర్వాత తూచ్ అన్నప్పటికీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలాగే ఈటల రాజేందర్ కూడా తన పేరుతో గెలిచాను కానీ బీజేపీ వల్ల కాదని పరోక్షంగా చెబుతూనే వస్తున్నారు. తన స్థాయికి తగ్గ పదవి ఇవ్వాలని అంటున్నారు.
పార్టీ పరువును సోషల్ మీడియాలో పడేసిన జితేందర్ రెడ్డి
మరో వైపు మాజీ ఎంపి జితేందర్ రెడ్డి పార్టీ పరువును సోషల్ మీడియాలో పడేశారు. ఓ దున్నపోతును తన్నే మీమ్ ను పెట్టి… రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలన్నారు. దాన్ని అగ్రనేతలకు ట్యాగ్ చేశారు. దీంతో వైరల్ అయింది. తాను బండి సంజయ్ ను సపోర్ట్ చేస్తున్నానని.. వ్యతిరేకించేవారికే ఆ ట్వీట్ అని చప్పుకొచ్చారు. తర్వాత రఘునందన్ రావుకు ఓ పదవి ఇవ్వడాన్ని తాను సపోర్ట్ చేస్తానని ట్వీట్ చేశారు. అదే రఘునందన్ రావు బండి సంజయ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అసలు మొత్తం బీజేపీలో ఏం జరుగుతుందా అన్న సందేహం వస్తోంది.
మార్పుచేర్పుల తర్వాత బజారున పడటం ఖాయం
తెలంగాణ బీజేపీలో ప్రస్తుత పరిస్థితి బ్లాస్ట్ అవడానికి రెడీగా ఉన్న బాంబులా ఉంది. బండి సంజయ్ అందర్నీ కలుపుకుని వెళ్లలేకపోవడం ఇతరుల్ని తొక్కేయాలని చూడటంతో వీరంతా ఏకమయ్యారు. అదే సమయంలో బీజేపీ హైకమాండ్.. బీఆర్ఎస్ విషయంలో చూపిస్తున్న సానుకూలత వీరికి నచ్చడం లేదు. అందకే పార్టీలో మార్పు చేర్పులేవో చేస్తున్నారు కదా… చేసిన తర్వాతే అసలు నిర్ణయాలు తీసుకుందామనుకుంటున్నారు. బీజేపీ గతంలో రేసులో ఉందని అనుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొసమెరుపేమిటంటే… కాంగ్రెస్ లో ఇలాంటి గొడవలు బాగా తగ్గిపోయాయి.