తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో కనిపిస్తున్న పరిణామాలను గమనిస్తే.. రకరకాల సందేహాలు కలుగుతాయి. అటు తెలంగాణలో మిత్రపక్షాలు రెండూ విడివిడిగా బరిలోకి దిగి తొడకొట్టే పరిస్థితి ఉన్నది. ఇటు ఆంధ్రప్రదేశ్లో భాజపా నాయకులు కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా మాటలు రువ్వుతున్నారు. అయితే పార్టీ వర్గాలను ఆరా తీసినప్పుడు.. ఓ కొత్త విషయం తెలిసి వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మిత్రపక్షం కదా అనే సానుభూతితో తెలుగుదేశం పట్ల మెతక వైఖరి అనుసరించడం కాకుండా.. వారితో తలపడుతూ.. సిగపట్లు పట్టగల వారికే రాష్ట్ర అధ్యక్షులుగా కమలదళ సారథ్యం కట్టబెడతారనేదే ఆ సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షులను త్వరలో నియమించాల్సి ఉంది. తెలంగాణలో మూడు టర్మ్స్ పదవిని అనుభవించేసిన కిషన్రెడ్డి సీజను అయిపోయింది. ఆయన మీద పార్టీ విశ్వాసం కూడా సన్నగిల్లిందనే ప్రచారమూ ఉంది. ఈనేపథ్యంలో కచ్చితంగా పార్టీ నాయకత్వ మార్పు ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు , చంద్రబాబునాయుడు పట్ల ఆయన పాలన పట్ల చాలా మెతగ్గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పార్టీ వద్ద ఉన్నాయి. ఆ పార్టీ రాష్ట్ర నాయకులే పలు సందర్భాల్లో కేంద్రనాయకత్వానికి ఈ మేరకు ఫిర్యాదులుచేశారు. ఆయనకు కొనసాగింపు ఉండకపోవచ్చు.
మరి కొత్త కమల సారధులుగా రెండు చోట్ల కూడా తెలుగుదేశంతో సై అంటే సై అనగల వారినే ఎంపిక చేస్తారని సమాచారం. రాష్ట్ర పార్టీ నాయకత్వ రేసులో ముందంజలో ఉండడానికేనా అన్నట్లుగా ఇప్పటికే తెదేపా మీద కత్తులు దూస్తారనే మార్కు ఉన్న సోము వీర్రాజు గానీ.. తాజాగా మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుగానీ.. సరికొత్త పాత విమర్శలకు దిగుతున్నారని అనుకోవాలి. 6వ తేదీన అమిత్షా వచ్చేలోగా… తెలుగుదేశాన్ని వీలైనంత తిట్టి.. తమకంటూ ఒక ముద్ర ఏర్పాటుచేసుకుంటే.. తద్వారా.. రాష్ట్ర పార్టీ నాయకత్వం దక్కవచ్చునని పలువురు ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.