గడచిన వారం రోజులుగా అవిశ్వాస తీర్మానం విషయంలో లోక్ సభలో జరిగిన డ్రామాలు చూశాం. ఉదయం సభ ప్రారంభం కావడం, ఒక నిమిషంలోగా వాయిదా! మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు సభ పునః ప్రారంభం, పది నిమిషాల్లోగా రేపటికి వాయిదా! సభ ఆర్డర్ లో లేదు అనే సాకుతో గడచిన వారమంతా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనీయలేదు. అయితే, గతవారమంతా ఒక లెక్క… ఈవారం ఇంకో లెక్క. ఇప్పుడు భాజపా స్పందించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే, ఏపీ ఎంపీలతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సీపీఎం, ఆరెస్పీ కూడా నోటీసులు ఇచ్చాయి. అంతేకాదు, గతవారమంతా స్పీకర్ పోడియం వద్ద హంగామా చేసిన తెరాస ఎంపీలు కూడా మంగళవారం సభలో సహకరిస్తామని అంటున్నారు. అన్నాడీఎంకే ఎంపీలు పరిస్థితి ఏంటనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు.
కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్య మీదే కదా, ఆ రాష్ట్ర ఎంపీలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా గత వారం భాజపా ధోరణి కనిపించింది. అంతేకాదు, ఏపీ విభజన హామీలూ, ప్రత్యేక హోదా పోరాటాలు వీటిపై ఇతర రాష్ట్రాలకు ఆసక్తి లేదనీ, ఢిల్లీలో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదనే లెక్కల్లో భాజపా ఉండేది. కానీ, టీడీపీ కేంద్రమంత్రుల రాజీనామాల తరువాతి నుంచి ఏపీ సమస్యపై అన్ని పార్టీలు, జాతీయ మీడియా కూడా దృష్టి సారిస్తోంది. అవిశ్వాస తీర్మానం విషయమై గత వారమంతా లోక్ సభలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై తీవ్ర విమర్శలూ వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు భాజపా డిఫెన్స్ లో పడిందని చెప్పొచ్చు. అయితే, ఈ పరిస్థితిలో కూడా తమదే పైచేయి అన్నట్టుగా భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతున్నారు!
అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం ఒక డ్రామా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలన్నింటికీ పార్లమెంటులో సమాధానం చెబుతామని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ఇప్పటివరకూ కేంద్రం చేసిన సాయాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు. మొత్తానికి, అవిశ్వాసంపై చర్చకు భాజపా సిద్ధంగా ఉందనే సంకేతాలే ఆయన ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి అంశాలు చర్చలోకి రానీయకుండా.. ఆంధ్రాకి తాము చాలా చేశామనే వాదన వినిపించేందుకు భాజపా రెడీగా ఉందని అనిపిస్తోంది. అయితే, ప్రధాని మోడీ, అమిత్ షాలు ద్వయం ఆలోచనలు ఎప్పుడు ఎలా మారతాయో ఆ పార్టీ వారికే తెలీదు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్ధంగా ఉన్నట్టు జీవీఎల్ సంకేతాలు ఇచ్చినా… చివరి నిమిషంలో మోడీ, షా నిర్ణయం ఎలా మారుతుందో చూడాలి. ఏదేమైనా, ఏపీ అంశం ఇలా చినికిచినికి గాలివాన అవుతుందని భాజపా ముందుగా ఊహించలేకపోయిందేమో..!