ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ గొంతు వినిపించదు. ఎందుకంటే.. ఏకైక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్.. సమావేశాలకు వెళ్లకూడదని అనుకుంటున్నారు. ఎందుకంటే… అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడాలో ఆయనకు క్లారిటీ లేకుండా పోయింది. ఈ విషయంపై పార్టీ నాయకత్వానికి ఆయన రెండు లేఖలు రాశారు. అసెంబ్లీలో పార్టీ తరుపున ఏయే అంశాలను లేవనెత్తాలో తెలపాలని ఓ లేఖ, అసెంబ్లీ సమావేశాల సమయంలో తనకు వివిధ అంశాలపై సమాచారం ఇవ్వటానికి పార్టీ తరుపున సహాయకుడిని ఇవ్వాలని మరో లేఖ రాశారు. అయితే ఆయన లేఖలను బీజేపీ తెలంగాణ నాయకత్వం పట్టించుకోలేదు.
పార్టీ నుంచి సహకారం లేకపోవడంతకో అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరుకానని చెబుతున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో తెలంగాణ సర్కార్ ఫెయిలయిందని… ఆ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని రాజాసింగ్ రెడీ అయ్యారు. అయితే తన ఉత్సాహంపై తన పార్టీ నాయకత్వం నీళ్ళు చల్లింది. తెలంగాణలో ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనకు పార్టీ సహకరించకపోతే.. తాను కూడా పార్టీ నాయకత్వానికి సహకరించనని రాజాసింగ్ నిర్ణయించుకున్నారు. రాజాసింగ్ వివాదాస్పద మాటతీరు ఉన్నవ్యక్తి. అసెంబ్లీలో లేనిపోనివి మాట్లాడి కొత్త సమస్యలు తెస్తారని అనుకున్నారేమో కానీ… రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా లేనట్లే బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఎవరున్నా రాజాసింగ్కు పడదు. గతంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్తోనూ సరిపడలేదు. ఇప్పుడు అదే పరిస్థితి. కొద్ది రోజుల కిందట.. పార్టీ రాష్ట్ర కమిటీలో తను సూచించిన వారికి పదవులు ఇవ్వలేదని బండి సంజయ్ పై మండిపడ్డారు. బండి సంజయ్ తో తాను చేసిన వాట్సాప్ చాటింగ్ ను బయటపెట్టారు. దాంతో… అంతో ఇంతో ఉండే సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.