ప్రజలు గెలిపించే పార్టీ ప్రజాస్వామ్యంలో వారిని పరిపాలిస్తుంది. అదే ప్రజలను ఓడించే పార్టీ ఎప్పటికీ ప్రజాస్వామ్యంలో భాగం కాదు…పైగా ముప్పు అవుతుంది. భారతీయ జనతా పార్టీ రాను రాను భారత ప్రజాస్వామ్యానికి అదే ముప్పు తెచ్చి పెడుతోంది. రాజకీయ పార్టీలను అడ్డగోలుగా చీల్చడం.. ఫిరాయింపులను ప్రోత్సహించడం.. ప్రభుత్వాలను మార్చడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విపక్షాలు ఏకమయ్యేందుకు.. ఒకే ఒక్క సమావేశం నిర్వహించారు. అంతే.. రెండో సమావేశం జరుగుతుందా లేదా అన్నంతగా ఆ పార్టీలను కకావికలం చేసేందుకు బీజేపీ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తాజా మహారాష్ట్ర పరిణామాలు.
దారికి రాని ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే పనిలో బీజేపీ
జూన్23న పట్నాలో కాంగ్రెస్‌తో సహా 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయిన పదిరోజుల్లోనే బీజేపీ ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడింది. ఈ సమావేశానికి హాజరైన మరాఠా నాయకుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని రెండు ముక్కలు చేశారు. మహారాష్ట్రలో శివసేనను రెండుగా చీల్చిన ఏడాది లోపే ఎన్సీపీని చీల్చి మరోసారి ఆపరేషన్ లోటస్‌ను అమలు చేశారు. శివసేనను చీల్చడం ద్వారా మహా వికాస్ అగాధీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎన్సీపీని కూడా చీల్చింది. తర్వాత వంతు బీహార్ అధికార పార్టీ జేడీయూదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో నితీష్ కుమార్.. విపక్షాల కూటమి రెండో మీటింగ్ సంగతి పక్కన పెట్టి.. తన పార్టీ ఎమ్మెల్యేలతో రోజూ సమావేశం అవుతున్నారు. నాలుగు రోజుల పాటు ఎమ్మెల్యేలందర్నీ పిలిచి ఆయన మాట్లాడుతున్నారు. బీజేపీ ఆకర్ష్ కు ఎవరైనా లొంగిపోయారో చూసుకుంటున్నారు. చివరికి ఈ బాధ అంతా ఎందుకు మళ్లీ బీజేపీతో కలిసిపోతే మంచిది కదా అని ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం ప్రారంభమయింది. అంటే విపక్షాల కూటమికి పిల్లర్ గా ఉన్న నితీష్ కుమారే బీజేపీ పంచన చేరితే.. ప్రతిపక్ష కూటమి నైతిక పరాజయం పాలైనట్లే. బీజేపీ అగ్రనేతలు కూడా ఇదే కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఒకప్పుడు అధికారం తలకెక్కి కాంగ్రెస్ కన్నూమిన్ను గానకుండా వ్యవహరించినందుకు దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకచ్చాయి. వాటిని ఇప్పుడు మోదీ నయానా, భయానా లొంగదీసుకునేందుకు ప్రయత్నించడమే కాక తగ్గని వాటిని తుంచేసేందుకు రెడీ అయ్యారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో నేతలను, ఎమ్మెల్యేలను వశపరుచుకుంటూనే మోదీ ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయడం ప్రారంభించారు.
విపక్ష కూటమి ఏకం కావడంతో పంజా
విపక్షాల కూటమి సమావేశం కావడం.. కర్ణాటక ఫలితాల తర్వాత మారుతున్న రాజకీయాలతో పట్టు జారుతోందని అనుకున్నారేమో కానీ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత పంజా విసరడం ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ బీజేపీ రెండు రకాల వ్యూహాలను పాటిస్తోంది. కొన్ని చోట్ల తాము తగ్గడం.. మిగిలిన చోట్ల.. ఇతర పార్టీల్ని నిర్వీర్యం చేయం. కానీ ఇది తగ్గడం కాదు.. సామంత రాజ్యాల్ని ఏర్పాటు చేసుకోవడం. రాజకీయాల్లో అధికారం అనేది ఎవరికైనా అంతిమ లక్ష్యం. అందులో సందేహం ఉండదు. లఆ అధికారం సాధించడమే విజయం. నైతిక విజయాలు.. ఓడినా ప్రజల మనసుల్ని గెలుచుకున్నాం వంటి మాటాలకు పైసా విలువ ఉండదు. అందుకే గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాయి. అధికారంలో ఉండే పార్టీలకు ఇది మరింత అడ్వాంటేజ్ … వారు విపక్షాలను అణిచివేయవచ్చు. అయితే మన దేశంలో విపక్షాలపై అధికార పార్టీలు కక్ష సాధింపులకు పాల్పడితే గతంలో ప్రజల సానుభూతి లభించేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. అయితే ఇంత కాలం రాజకీయ పార్టీలు ఏం చేసినా.. రాజ్యాంగంపై.. కాస్త భయంతో ఉండేవి. అందుకే తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను వ్యవస్థలను ఉపయోగించి అణిచి వేస్తున్నాయి. ఇలాంటి ప్రయోగాల్లో ప్రధాని మోదీ ఇప్పుడు ఎవరూ ఊహించనంత వేగంగా పావులు కదుపుతున్నారు.
సామంత పార్టీలుగా ఉండే వారిపై చల్లని చూపు
జూన్23న పట్నాలో కాంగ్రెస్‌తో సహా 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయిన పదిరోజుల్లోనే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని రెండు ముక్కలు అయింది. దీని వెనుక ఉన్నది బీజేపీనేనని చెప్పాల్సిన పనిలేదు. కురువృద్ధ నేత శరద్ పవార్ పట్టు రోజురోజుకూ బలహీనపడుతున్న తరుణంలో ఎన్సీపీని చీల్చడం ద్వారా మహారాష్ట్రలో బీజేపీని మరింత శక్తిమంతమైన పార్టీగా మార్చడమే బీజేపీ ధ్యేయం. తర్వాత బీహార్‌లోని జనతా దళ్ యునైటెడ్ వంతు అని చెబుతున్నారు. నితీష్ కుమార్ .. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేయాలనకుంటున్నారు. కానీ ఆయనకు పార్టీ నీడ లేకుండా చేయాలని బీజేపీ అనుకుంటోంది. కూటమిలో ఉన్న మిగతా పార్టీలకూ అదే ముప్పు పొంచి ఉంది. దీంతో బెంగళూరులో జరగాలనుకుంటున్న రెండో విడత బీజేపీయేతర పక్షాల సమావేశం జరుగుతుందా లేదా అన్న సందేహం ప్రారంభమయింది. సర్జికల్ స్ట్రయిక్ .. ఈ పదం ప్రధాని నరేంద్రమోదీకి బాగా ఇష్టం. యుద్ధ విమానాలు మేఘాల్లోదాక్కుంటూ వెళ్లి పొరుగు రాష్ట్రంలో బాంబాలు వేసిన వచ్చిన వైనాన్ని ఆయన విశదీకరించిన అంశాన్ని ఎవరూ మర్చిపోలేరు. అదే తహాలో ఇప్పుడు దేశంలో తమకు వ్యతిరేకమైన పార్టీలపై ఈ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. తర్వాత సర్జికల్ స్ట్రైక్ బీహార్ మీద పడే ప్రమాదాన్ని ఏ మాత్రం తోసి పుచ్చలేము. ప్రదాని మోదీ గురించి బాగా తెలుసు కాబట్టి నితీష్ కుమార్.. మళ్లి ఎన్డీయే లోకి వెళ్లే అవకాశాల గురించి అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అదే జరిగితే ప్రతిపక్ష ఐక్యతా యత్నాల దిశ, దశ మారే అవకాశాలున్నాయి. ఒక వంక కమలనాథులు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్ల కు పార్టీ ని సన్నద్ధం చేస్తూనే మరోవంక బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అమలు పరచాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తు న్నారు. అన్ని ప్రాంతీయపార్టీలను బీజేపీ, ప్రధాని టార్గెట్ చేయడం లేదు. తమకు సామంతులుగా ఉండే పార్టీలను దయతలిచి వదిలేస్తున్నారు. భవిష్యత్‌లో తమ వైపు వస్తాయని సంకేతాలు పంపుతున్న వాటి జోలికీ వెళ్లడం లేదు. తమతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని.. పరోక్షంగా అయినా తమ వైపే ఉంటామని సామంతులుగా మసలుకుంటామని సంకేతాలిస్తే చాలు.. క్షమించాం పోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీపై యుద్ధం ప్రకటించి.. చివరికి తెల్ల జెండా ఎగురవేసిన బీఆర్ఎస్ ను కూడా బీజేపీ చల్లగా చూస్తోదంని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయి. అదే సమయంలో తమకు నమ్మకమైన అప్రకటిత మిత్రపక్ష పార్టీగా ఉంటున్న వైసీపీ జోలికి వెళ్లడం లేదు. ఆ పార్టీని ఎన్ని కేసులు వెంటాడుతున్నా..చివరికి కుటుంబసభ్యుడ్ని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటన్నా.. దిలాసాగా ఉంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇక అదే రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ.. మోదీతో పెట్టుకోవడం ఎందుకని.. జగన్ తో తలపడితే చాలని ఫిక్స్ అయిపోయింది. తాము మోదీ విధానాలను సమర్థిస్తామని చంద్రబాబు నేరుగా ప్రకటించారు. బీజేపీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. దీంతో బీజేపీ ఆ పార్టీని కూడా ఇప్పటికైతే సామంతుల కేటగిరిలోనే చేర్చుకుంది. రేపేం చేస్తుందో తెలియదు.
అప్పట్లో కాంగ్రెస్ చేసిన దాని కంటే రెట్టింపు ఘనకార్యాలు !
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా తమను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలు ఉన్న చోట పట్టు నిరూపించుకోవడానికి కేంద్రం ప్రజలు ఏమనుకుంటారో అని మొహమాట పడి తమ వ్యూహాలను మార్చుకోవడం లేదు. బీజేపీ ఎంతటి సాహసోపేత నిర్ణయా లకై నా వెనుకడుగు వేయడం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రమే కాదు.. రాజకీయంగానూ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు. మరో పది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడో సారి గెలవడం అనేది మాత్రమే ప్రధాని మోదీ ముందు ఉన్న లక్ష్యం. దానికి నైతికత.. అనైతికత అనే అడ్డంకుల్ని ఆయన తొలగించుకున్నారు. రాజకీయాల్లో విజయమే మాట్లాడుతుందని.. ఆయనకు తెలుసు. అందుకే మోదీ ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నారు. ఇందులో నలిగిపోయేవాళ్లు ఎంత మంది.. తట్టుకుని నిలబడేవాళ్లు ఎంత మందనేది ముందు ముందు తెలుస్తుంది. ఇంతకు ముందే చెప్పినట్లు విజయానికి అడ్డదారులుండవు. గెలిస్తే ఏ దారిలో వచ్చినా సరైన దారే. రాజకీయాల్లో అయితే ఇది వంద శాతం వర్తిస్తుంది.. ప్రధాని మోదీ అదే చేస్తున్నారు. కానీ ఆయన అధికారం పయనిస్తున్న దారిని జడ్జ్ చేసి తీర్పు చెప్పాల్సింది ప్రజలే. ఆ అధికారం ప్రజల దగ్గర ఉంది. అంటే.. ప్రజలు.. ఓటర్లే నిర్ణేతలు.
కర్ణాటక ఫలితాలు బీజేపీకి ప్రజలు ఇచ్చిన హెచ్చరికే – కానీ గుర్తించలేనంతగా కళ్లకు అధికార పొరలు !
నిజానికి భారతీయ జనతా పార్టీకి ప్రజలుకూడా ఇలాంటి ప్రమాద కర గేమ్ ఆడితే.. శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని నిరూపిస్తూనే ఉన్నారు. కానీ ఆ ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకునేందుకు బీజేపీ సిద్ధపడటం లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు. వాజ్ పేయి హయాంలో ఉన్న బీజేపీని పక్కన పెడితే మోదీ , షా ల చేతికి బీజేపీ వచ్చిన తర్వాత తొమ్మిదేళ్లలో పడగొట్టిన ప్రభుత్వాలు.. నిర్వీర్యం చేసిన పార్టీలు.. టార్గెట్ చేసుకున్న నేతల్ని లెక్క తీస్తే.. ఓ చరిత్ర అవుతుంది. ఇంకా చెప్పాలంటే 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో అంతకు మించే ఘనకార్యాలు చేసింది. కాంగ్రెస్ అంతకు మించి అనుభవించింది.. అనుభవిస్తోంది కూడా. మరి బీజేపీకి శిక్ష పడదా..?. కాస్త ఆలోచిస్తే బీజేపీకి ఇప్పటికే శిక్ష పడటం ప్రారంభమైంది. కర్ణాటతోనే ప్రారంభమైంది. కానీ గుర్తించేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదు. కర్ణాటకలో 2018 కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేదు. కానీ గవర్నర్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికి ఎమ్మెల్యేలను కొనాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్ ఏర్పాటయింది. మధ్యలో హఠాత్తుగా కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఆపరేషన్ కమల్ ద్వారా కూల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎంత వ్యూహాత్మక తప్పిదమో ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయంతో బీజేపీకి తెలిసి రావాలి. ఎందుకంటే కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వంపై అప్పటికే వ్యతిరేకత ఉంది. అదే సమయంలో రెండు పార్టీల మధ్య సఖ్యత కూడా కొరవడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు రెండు పార్టీలు కలిసి పోటీ చేసే ఉద్దేశంలో లేవు. అలాంటి సమయంలో వెదికి పట్టుకుని మరీ దరిద్రాన్ని వెంట తెచ్చుకున్నట్లుగా… ఆపరేషన్ కమల్ చేసి మరీ ప్రభుత్వాన్ని కూల్చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాని వల్ల ఏం ఒరిగింది ? ఓ వైపు ప్రభుత్వాన్ని అన్యాయంగా కూలదోసి ప్రజలు ఇవ్వని అధికారాన్ని చేజిక్కించుకున్నరన్న అపవాదుతో పాటు.. ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం బీజేపీ సర్కార్ పై పడింది. ఫలితంగా ప్రజల మద్దతు కోల్పోవడమే కాదు పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అదే ప్రభుత్వాన్ని కూల్చకుండా ఉన్నట్లయితే… కాంగ్రెస్, జేడీఎస్ … పై ఆ వ్యతిరేకత వచ్చి ఉండేది. బీజేపీ ఘన విజయం సాధించి ఉండేది. పొత్తులు అవసరం లేకుండానే ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండేది. కానీ బీజేపీ చాణక్యం అని చెప్పుకున్న రాజకీయం వల్ల ఓడిపోయింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ చేయాలని చూస్తోంది. కానీ కర్ణాటక ఫలితాల్ని నిశితంగా గమనిస్తే.. బీజేపీ చేసిన తప్పు మళ్లీ చేయదు.
అధికారంలో ఉన్నపార్టీలు కనీస ప్రజాస్వామ్య విలువలు పాటించకపోతే మొదటికే మోసం వస్తుంది. ప్రజలు మొదట్లో చూసీ చూడనట్లుగా ఉంటారేమో కానీ.. అదే పనిగా తప్పులు చేస్తూంటే కర్రు కాల్చి వాత పెడతారు. మీరు చేసేది చాణక్యం కాదని.. చెబుతారు. అలా చెప్పారని తెలిసేది అధికారం కోల్పోయిన తర్వాతనే. ముందుగా మేలుకుంటేనే రాజకీయాల్లో మనగలుగుతారు. ఇవాళ కాకపోతే రేపైనా బీజేపీకి ప్రజలు బుద్ది చెబుతారు. కానీ ఈ లోపు ప్రజాస్వామ్యానికి ఎంత నష్టం జరుగుతుందనేదే అందరి ఆందోళన.