ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అరకొర నిధులు విదిలించడమే తప్ప ఏనాడూ దేనికీ తగినన్ని నిధులు విడుదల చేయలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా మంత్రులు, నేతలు అందరూ కోరస్ పాడటం మనం రోజూ వింటూనే ఉన్నాము. ఇదివరకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రానికి సుమారుగా రూ.1.40 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు. కానీ అది ప్రజలకు సరిగ్గా చేరినట్లు లేదు.
ఈరోజు విజయవాడలో జరిగిన భాజపా కోర్ కమిటీ సమావేశానికి పార్టీ వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్ వచ్చినప్పుడు, ఇంతవరకు రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.1,70,686 కోట్లు ఇచ్చేమని చెప్పారు. రాష్ట్రానికి పన్నుల రూపంలోనే ఏడాదికి రూ. 2,06,919 కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. దేశంలో ఇతర జాతీయ ప్రాజెక్టులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 70:30 శాతంలో నిధులు పెట్టుకొంటుంటే, రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోలవరానికి 100 శాతం పెట్టుబడిని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.
విభజన చట్టంలో అన్ని హామీలను అమలుచేస్తూ, రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నా కూడా కొందరు నేతలు కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ప్రచారం చేస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారని సిద్ధార్థ నాథ్ సింగ్ విమర్శించారు. ప్రజలను తప్పు ద్రోవ పట్టించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
ఆయన చెప్పినవన్నీ తెదేపాని ఉద్దేశ్యించేనని వేరేగా చెప్పనవసరం లేదు. ఆయన చెపుతున్న దాని ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిగిలిన రాష్ట్రాల కంటే కూడా చాలా ఎక్కువే నిధులు మంజూరు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్రం ఇస్తున్న ఈ బారీ నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి పన్నుల రూపేణా రూ. 2,06,919 కోట్ల ఆదాయం వస్తోందంటే, రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్నట్లు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరీ అంత దయనీయంగా లేదని అర్ధమవుతోంది. డిల్లీ నుంచి వచ్చిన సిద్ధార్థ నాథ్ సింగ్ కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ఆధారంగానే ఈ లెక్కలు చెపుతున్నారు కనుక వాటిని కాకి లెక్కలుగా తీసిపడేయలేము. ఆయన చెప్పినవి తెదేపా చెపుతున్నదీ పూర్తి విరుద్దంగా ఉన్నాయి. అయితే ఆయన చెప్పవలసినదంతా స్పష్టంగానే చెప్పి, చంద్రబాబు నాయుడు పట్ల తమకు చాలా గౌరవం ఉందని, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం తగదని సున్నితంగా హెచ్చరించారు.