తెలంగాణలో ఐటీ దాడులు ప్రారంభం కావడంతో అందరి చూపూ కేసీఆర్ పై పడింది. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీని ఒకే సారి టార్గెట్ చేయడం.. వారంతా కేసీఆర్ కు సన్నిహితులు కావడంతో మళ్లీ మ్యూజిక్ స్టార్ట్ అయిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఇటీవలి కాలంలో తన పార్టీకి నిధుల్ని కొత్త పద్దతిలో వైట్ గా చేసుకుంటున్నారని.. ఇందుకు పార్టీ నేతల కంపెనీల్ని వాడుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు సహజంగానే సంచలనం రేపాయి.
గతంలో దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్న కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించారు. దేనికైనా సిద్ధమన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మార్చారు. అయితే తర్వాత కాస్త దూకుడు తగ్గించారు. ఇప్పుడు మళ్లీ బీజేపీపై విరుచుకుపడే సందర్భం వచ్చిందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. బీజేపీపై దూకుడు తగ్గించడం వల్ల ప్రజల్లో ఇప్పటికే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని.. ఇప్పుడు మళ్లీ యుద్ధం ప్రారంభిస్తే.. బీజేపీ విషయంలో రాజీ పడలేదని ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు.
ఇప్పటికైతే ఐటీ అధికారుల దాడులపై బీఆర్ఎస్ నేతలు.. పెద్దగా స్పందించడం లేదు. సోదాలు జరుగుతున్న నేతల అనుచరులు మాత్రమే స్పందించారు. అగ్రనేతలెవరూ మాట్లాడలేదు. మాట్లాడవద్దన్న సంకేతాలు వెళ్లాయి. మామూలుగా ఇలాంటి దాడులు జరిగితే.. కవిత , కేటీఆర్ వెంటనే స్పందిస్తారు. కానీ ఇక్కడ అలాంటివేమీ లేదు. మరికొన్ని దాడులు జరిగితే… కేసీఆర్ సూచనలను బట్టి మళ్లీ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తారేమోనన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది.