చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు ఎన్నికల సంఘం స్వతంత్రతను తొలగించి ప్రభుత్వ కమిటీగా మార్చేసింది. ఈసీ నియామకానికి ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కాలరాసేందుకు మోదీ సర్కార్ కొత్త చట్టం చేసింది.
ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్లను నిర్ణయించాలని బిల్లు నిర్దేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టారు. ప్రతిపాదిత బిల్లులో క్యాబినెట్ కార్యదర్శి, మరో ఇద్దరు సీనియర్ అధికారులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్నికల కమిషనర్ పదవికి పరిగణించదగిన వారి జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. సెర్చ్ కమిటీ ఐదుగురిని సిఫారసు చేయవచ్చు. అయితే క్యాబినెట్ సెక్రెటరీ స్థానంలో న్యాయశాఖ మంత్రిని సెర్చ్ కమిటీకి అధిపతిగా నియమిస్తూ ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్లకు మొదట కేబినెట్ సెక్రటరీకి సమానంగా జీతం ఇవ్వాలని నిబంధన పెట్టారు. ఇది ఎన్నికల కమిషనర్ల స్థాయిని తగ్గించినట్లేనన్న విమర్శలు తలెత్తడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి జీతం చెల్లించేలా సవరణ తీసుకొచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్లు తమ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు అన్ని క్రిమినల్ , సివిల్ దావాల నుంచి రక్షణ ఉంటుందని బిల్లులో పెట్టారు. ఎలా చూసినా.. మొత్తంగా ఈసీ కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయినట్లే.