కేంద్రంలో ఏర్పడనుంది సంకీర్ణం కావడంతో ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ జరిగివన్నీ మారిపోతాయి. ముఖ్యంగా బీజేపీ ఏకపక్షంగా ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నాలు చేసేది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనుకున్నట్లుగా నాలుగు వందల సీట్లు సాధించినట్లయితే ఆరు నెలల్లో హిమాచల్ , తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలకు గండం వచ్చి పడేది. కానీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలను బీజేపీ చేసే అవకాశం లేదు.
ప్రభుత్వాల జోలికి వెళ్లేంత వెసులుబాటు ఇప్పుడు బీజేపీకి ఉండదు. ప్రతి రాజకీయ నిర్ణయం మిత్రపక్షాలపై ప్రభావం చూపుతుంది. వారి స్పందన ప్రభుత్వాన్ని కూల్చే చాన్స్ కూడా ఉంటుంది. అందుకే అలాంటి పనులు చేయరు. అదే సమయంలో ఇతర పార్టీలపై దర్యాప్తు సంస్థల దూకుడు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. నెలల తరబడి జైళ్లలో మగ్గుతున్న వారికి విముక్తి లభించనుంది. ఈడీ కి ఉన్న అధికారాల పేరుతో కొంత మందిని నెలల తరబడి జైళ్లలో పెట్టేస్తున్నారు. ముఖ్యమంత్రుల్ని కూడా వదల్లేదు. జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను రెండు ఎకరాల కేసులో అరెస్టు చేశారు. ఇప్పటి వరకూ బెయిల్ ఇవ్వడానికి న్యాయవ్యవస్థ ధైర్యం చేయలేదు. కేజ్రీవాల్ పరిస్థితి అంతే. కవిత సంగతి చెప్పాల్సిన పని లేదు.
ఇలాంటి వారు చాలా మంది ప్రతిపక్ష నేతలు జైళ్లలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ధైర్యంగా పోరాడే అవకాశం ఉంది. వారిపై బీజేపీ నేతలు వేధింపులకు పాల్పడే అవకాశం తగ్గిపోతుంది. వ్యవస్థలకు కూడా కాస్త ధైర్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి.