ప్రతీయేటా సెప్టెంబర్ మొదటి వారం వచ్చిందంటే చాలు… తెలంగాణ విమోచన దినం గురించి భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడటం మొదలుపెడతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పందించాలనీ, విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తారు. అయితే, ఈ ఏడాది మాత్రం భాజపా ఈ అంశాన్ని ఇంకాస్త సీరియస్ గానే తీసుకుంది. రాష్ట్రంలో భాజపాని విస్తరించాలనే వ్యూహంలో ఉన్నారు కాబట్టి, విమోచన దినం డిమాండ్ ను మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి సెంటిమెంట్ ను వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదే అంశంతో భాజపా కేడర్ లో ఉత్సాహం నింపడానికీ, కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేయడానికీ వినియోగించుకుంది.
విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ తో మొదలైన భాజపా యాత్ర ముగిసింది. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకూ జరిగిన యాత్ర విజయవంతం అయిందని అంటున్నారు రాష్ట్ర భాజపా నేతలు. హైదరాబాద్ లోని గన్ పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించిన తరువాత ఈ యాత్ర మొదలైంది. భువనగిరి, ఆలేరు, జనగాం, స్టేషన్ ఘన్ పూర్, వరంగల్, తొర్రూర్, పరకాల, కరీంనగర్, మెదక్, అచ్చంపేట వరకూ సాగింది. ఈ యాత్ర దారి పొడవునా రోడ్ షోలు నిర్వహిస్తూ… అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ, ఈ నెల 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలనే పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ విమోచన యాత్ర ద్వారా కొత్త చరిత్ర సృష్టించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడిందని లక్ష్మణ్ అన్నారు. 2019లో భాజపా అధికారంలోకి రాబోతోందనీ, అప్పుడు విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని భాజపా నేతలు చెప్తున్నారు.
అయితే, ఈ యాత్రతో మాత్రమే విమోచన దినాన్ని వదిలిపెట్టేలా లేదు భాజపా! దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరిగిలే ప్రయత్నిస్తామని కూడా అంటున్నారు. సెప్టెంబర్ 17న నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు భాజపా నేతలు ప్రకటించారు. అంతేకాదు, ఈ సభకు రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరవుతారట. మొత్తానికి, తెలంగాణ భాజపాకి మరో సెంటిమెంట్ దొరికినట్టే ఉంది. ఎందుకంటే, ఈ విమోచన దినం గురించి కేసీఆర్ మాట్లాడరు. అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో వినిపిస్తున్నదే. ప్రతీయేటా సెప్టెంబర్ మొదలు కాగానే ఇది తెరమీదికి వస్తుంది. కొన్నాళ్లపాటు కేసీఆర్ మౌనంగా ఉంటారు. ఆ రోజు అలాఅలా వెళ్లిపోతుంది. మళ్లీ దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. కానీ, ఇప్పుడీ అంశాన్ని భాజపా సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకుంటోంది. మరి, కేసీఆర్ సమాధానం ఎలా ఉంటుందో చూడాలి.